Modi – Chandrababu : చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టారా? ఇన్నాళ్లూ లోలోపల దాచుకున్న అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టేశారా? గతంలో తాను తప్పుచేసినట్టు ఒప్పుకున్నారా? తాను మోదీ స్నేహం కోసం సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తొలుత స్నేహితులైన ప్రధాని మోదీ, చంద్రబాబు గత ఎన్నికల్లో బద్ధ శత్రువులుగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు పాత స్నేహం కోసం తహతహలాడుతున్నట్టు సంకేతాలు పంపించారు. ఇందుకు రిపబ్లికన్ టీవీ చర్చాగోష్టిని వినియోగించుకున్నారు. మంగళవారం వర్చువల్ విధానంలో చర్చాగోష్టి సాగింది. అందులో చంద్రబాబు పాల్గొన్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యానించారు. బీజేపీతో స్నేహహస్తం కోసం ఎదురుచూస్తున్నట్టుగా చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. తాము ప్రధాని మోదీతోనే ఉంటామని స్పష్టం చేయడం గమనార్హం.
గత ఎన్నికల్లో వైఫల్యంతో..
గత ఎన్నికలకు ముందు బీజేపీ విషయంలో తాను చేసింది కరెక్ట్ కాదని చంద్రబాబుకు తెలుసు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాలతో చంద్రబాబు కూటమి కట్టారు. కానీ ఫెయిలయ్యారు. దానికి బీజేపీ దూరం కావడమేనని తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేపీకి దగ్గర కావడానికి చేయని ప్రయత్నం లేదు. నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీకి పంపించారు. కీలక నేతలు కాషాయదళంలోకి పంపించి బీజేపీ అగ్రనేతల ఒప్పించేందుకు పాడరాని పాట్లు పడ్డారు. అయినా ఢిల్లీ పెద్దల నుంచి ఆశించినంత సానుకూలత లేదు. అయినా సరే ఎక్కడో ఒక ఆశ. ఎన్నికల నాటికి బీజేపీ తనతో కలిసి వస్తుందన్న నమ్మకం. అయితే తాజాగా రిపబ్లిక్ టీవీ చర్చాగోష్టి ద్వారా గతంలో తాను చేసిన తప్పిదాల గురించి ప్రస్తావిస్తూనే. చంద్రబాబు మోదీని ఆకాశానికి ఎత్తేశారు. బీజేపీతో పొత్తు కోసం తనను తాను తగ్గించుకున్నారు.
అవి రాష్ట్ర ప్రయోజనాల కోసమే…
ఎన్డీఏతో కలుస్తారా? అన్న ప్రశ్న వచ్చినప్పుడు చంద్రబాబు ఇలా స్పందించారు. గతంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ప్రధాని మోదీతో తమకు విధానపరమైన విభేదాలేవీ లేవని, ఆయన విధానాలను వ్యతిరేకించలేదని చెప్పారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరామని… అది రాకపోవడం వల్లే బయటకు వచ్చామని గుర్తుచేశారు. ప్రపంచంలో భారతదేశాన్ని ప్రధాని మోదీ బాగా ప్రమోట్ చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటికి ప్రపంచంలో అగ్రగామిగా మన దేశాన్ని నిలపాలని ఆయన అనుకుంటున్నారు. దేశాభివృద్ధి కోణంలో ఆయన విధానాలకు ఒక భారత పౌరుడిగా మద్దతిస్తున్నాను అని తెలిపారు. రాజకీయంగా ఎవరు ఎవరితో కలుస్తారనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని, ఊహాజనిత ప్రశ్నలకు తానిప్పుడు సమాధానం చెప్పనని స్పష్టం చేశారు. ఏన్డీఏని వీడి మూల్యం చెల్లించుకున్నారా? అన్న ప్రశ్నకు సైతం చంద్రబాబు సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. ప్రధాని మోదీపై ప్రతిపక్షాల విమర్శల గురించి ప్రస్తావించినప్పుడు సైతం చంద్రబాబు సమాధానం దాటవేశారు.
అనుకూల సిగ్నల్స్..
గత ఎన్నికల్లో ఎదురైన పరిణామాలతో చంద్రబాబు జాతీయ రాజకీయాల వైపు చూడడమే మానేశారు. కేవలం రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. అది కుదరకపోయినా.. ప్రధాని మోదీతో మాత్రం సఖ్యతగా మెలగాలని భావిస్తున్నారు. పొత్తుల గురించి కాకపోయినా… మోదీ విషయంలో తాను వ్యతిరేకంగా లేనని.. అవసరం పడితే తాను మోదీ వైపే ఉంటానని చంద్రబాబు సిగ్నల్స్ పంపారు. దీనిపై బీజేపీ అగ్రనేతలు మెత్తబడతారా? చంద్రబాబు చేరదీస్తారా? అన్నది కొద్దిరోజులుగా ఆగిచూస్తే తెలుస్తుంది.