ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ ఇబ్బందికరంగా తయారవుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైన కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. వరుస ఎన్నికల్లో పరాజయంతో కేడర్ పూర్తిగా డీలాపడిపోయింది. ఇది చాలదన్నట్టు ఇంటి పంచాయితీ కొద్ది కొద్దిగా రాజుకుంటోంది. మొన్నటి వరకు లోకేష్ ప్లేసును జూనియర్ భర్తీ చేయాలనే డిమాండ్లు వినిపించగా.. తాజాగా తానే పగ్గాలు చేపడతాననే హింట్ ఇచ్చారు బాలకృష్ణ. అక్కడక్కడా అభిమానులు రోడ్డెక్కి రచ్చకూడా చేశారు. పార్టీ అంతర్గత పరిస్థితిని చక్కదిద్దుకుంటూ.. రేపటి ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది చంద్రబాబు.
అయితే.. ఒంటరిగా జగన్ పార్టీపై యుద్ధానికి దిగి విజయం సాధించే అవకాశం ఉందా? అని అడిగితే.. ‘అవును’ అని గట్టిగా చెప్పలేని పరిస్థితి. బాబుకు సైతం ఈ విషయం అర్థమైందని అంటున్నారు. అందుకే.. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే.. ఇప్పటి నుంచే ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే.. మొన్న జరిగిన మహానాడులో తాము విపక్షాలతో కలిసి అధికార పక్షంపై యుద్ధం సాగిస్తామని చెప్పారు. బీజేపీతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. ఆ విధంగా.. వచ్చే ఎన్నికలకు బీజేపీతో కలిసి వెళ్లాలనే ఆలోచన, ఆశ ఉన్నట్టు ఇండైరెక్టుగా బయట పెట్టేశారు.
కానీ.. కమలనాథులు మాత్రం వెంటనే చెక్ చెప్పారు. నీ దోస్తీ మాకు అవసరం లేదు అని డైరెక్ట్ గా చెప్పేశారు. అవసరానికి వాడుకుని వదిలేస్తారనే విషయం అర్థమైందో.. మరో కారణం ఉందోగానీ.. బాబుతో చేయి కలిపే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. అయితే.. ఇక్కడే మరో అనుమానం కూడా వస్తోంది చాలా మందికి. బీజేపీ నేతలు నో చెప్పారు కానీ.. జనసేన ఏమీ మాట్లాడలేదు ఎందుకని? అనేది ఆ డౌట్.
ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీతో కొనసాగే ప్రసక్తే లేదని బీజేపీ అధికారికంగా స్టేట్ మెంట్ ఇచ్చినా.. జనసేన కనీసం పత్రికా ప్రకటన విడుదల చేయలేదు.. ఏ నేతా మాట్లాడలేదు అంటే.. వేరే ఆలోచన ఏదైనా ఉందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. తిరుపతి ఉప ఎన్నిక వేళ పవన్ కరోనా పేరుతో కావాలనే ప్రచారానికి రాలేదని సందేహించిన వాళ్లు కూడా ఉన్నారు. మరి, ఈ లెక్కన పవన్ వేరే ఆలోచన చేసే అవకాశం ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అంతేకాదు.. వచ్చే ఎన్నికల నాటికి కేంద్రంలో బీజేపీపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని, ఆ ప్రభావం రాష్ట్రంపైనా పడుతుందని బాబు భావిస్తున్నారని అంటున్నారు. అందువల్ల బీజేపీతో కాకుండా.. పవన్ తో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని, ఇందులో భాగంగానే.. జనసేన-బీజేపీ పొత్తును విడదీసే ప్రయత్నం చేస్తున్నారని కూడా విశ్లేషణలు చేస్తున్నారు. నిజంగా.. చంద్రబాబు ఆలోచన ఇదేనా? అన్నది తెలియాలంటే మరికాస్త సమయం వేచి చూడాల్సిందే.