ఇంట గెలిచి రచ్చగెలవాలనేది సామెత. చంద్రబాబు బయట ఓడినా.. ఇంట మాత్రం గెలుస్తూనే వచ్చారు. అయితే.. ఇప్పుడు ఆయనకు ఇంటి భయం పట్టుకుంది. టీడీపీ పగ్గాల విషయంలో కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ఒకెత్తయితే.. సొంత జిల్లా చిత్తూరులో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతుండడం మరో ఎత్తు. ఈ పరిస్థితి బాబును మరింత కలవరానికి గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. వారం పదిరోజులకు ఒకసారి అక్కడి నేతలతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తుండడం గమనార్హం.
మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కుప్పంతో సహా చిత్తూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వైసీపీ ఆధిక్యత ప్రదర్శించింది. మరికొన్ని చోట్ల కేడర్ జూనియర్ ఎన్టీఆర్ బాధ్యతలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తుండడం మింగుడు పడని అంశం. ఇదిలాఉంటే.. పార్టీ సీనియర్లుగా ఉన్నవారెవ్వరూ క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా లేరు. మాజీ మంత్రులు అక్కడ చాలా మందే ఉన్నారు. కానీ.. వారు పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుండడమే అసలు సమస్య. దీంతో.. ముందుగా సొంత ప్రాంతంలో పార్టీని బాగు చేసే పనిలో పడ్డారట బాబు.
మొన్నటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించారు. తాను స్వయంగా పర్యటించిన ప్రాంతాల్లోనూ జనసమీకరణ సరిగా జరగలేదనే అసంతృప్తిలో ఉన్నారు. మాజీ మంత్రులు గల్లా అరుణ కుమారి, అమర్ నాథ్ రెడ్డి, బొజ్జల సుధీర్ రెడ్డి వంటి నేతలు ఉన్నా.. పార్టీ బలహీనంగా కనిపిస్తుండడం బాబుకు మింగుడు పడట్లేదు.
అందుకే.. మళ్లీ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల్లో జోష్ పెరగాలంటే.. నాయకుడు వారితో టచ్ లో ఉండాలి. అందుకే.. ఈ నేతలందరినీ మళ్లీ యాక్టివ్ చేయాలని డిసైడ్ అయ్యారట. తరచూ జరుగుతున్న వర్చువల్ భేటీలు ఇందులో భాగమేనని అంటున్నారు. ఇప్పటికే అధికారానికి దూరమైన నేపథ్యంలో.. మరోసారి ఓడిపోతే పరిస్థితి మరింత దిగజారడం తథ్యం. అందుకే.. మూడేళ్ల నుంచే సైకిల్ రిపేర్లు మొదలు పెట్టారు. మరి, ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి.