Chandrababu: రాజకీయంగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారా? ఇండియా కూటమి వైపు అడుగులు వేయనున్నారా? తన అరెస్టుకు కేంద్ర పెద్దల సాయం ఉందని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధం లేని అభియోగాలు మోపి సిఐడి ఉక్కు పాదం మోపడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీని వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బీజేపీతో తెగతెంపులు చేసుకోవడమే మంచిదన్న అభిప్రాయం టిడిపి శ్రేణుల నుంచి వినిపిస్తోంది.
గత మూడు రోజులుగా చంద్రబాబు చుట్టూ కుట్ర జరుగుతున్నా.. కేంద్ర పెద్దలు కనీసం స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. అరెస్టు తీరును ఖండించారు. నిబంధనలు పాటించలేదని తప్పుపట్టారు. అయితే చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పు వచ్చిన తర్వాత ఆమె వ్యూహాత్మక మౌనం పాటించారు. సోమవారం రాష్ట్ర బంద్కు టిడిపి పిలుపునిచ్చినా బిజెపి మాత్రం మద్దతు ప్రకటించలేదు. పైగా టిడిపి బంద్కు బిజెపి మద్దతు అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన వచ్చింది. అది ఫేక్ అంటూ.. తాము టిడిపి బంద్ కు మద్దతు ఇవ్వలేదని పురందేశ్వరి ప్రత్యేక ప్రకటన ఇచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ నైజం బయట పడినట్టు అయింది. అందుకే పార్టీ శ్రేణులు బిజెపితో కటీఫ్ చెప్పడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు వామపక్షాలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత సిపిఐ నారాయణ, సిపిఎం రాఘవులు ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఇది ముమ్మాటికి కేంద్ర పెద్దల సహకారంతో జరిగిందని చెప్పుకొచ్చారు. సిపిఐ నారాయణ ఏకంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. ఇంతకుముందే నారాయణ చాలా సందర్భాల్లో కేంద్ర పెద్దల వైఖరిని తప్పుపట్టారు. వారిని నమ్మొద్దని కూడా చంద్రబాబుకు సూచించారు. ఇండియా కూటమిలోకి కూడా ఆహ్వానించారు. ఇప్పుడు నారాయణ నేరుగా వెళ్లి చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అటు లండన్ వెళ్లిన సీఎం జగన్.. నేరుగా ఏపీకి రాకుండా.. ఢిల్లీ పెద్దలను కలవనున్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు, చంద్రబాబు అరెస్ట్ విషయాలు కేంద్ర పెద్దలకు వివరించనున్నట్లు సమాచారం. మరోవైపు బిజెపి మిత్రపక్షం జనసేన చంద్రబాబు అరెస్టు విషయంలో ఆగ్రహంగా ఉంది. జగన్ తీరును పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవస్థలు సక్రమంగా పనిచేసే ఉంటే జగన్ సీఎం అయ్యే వారా అని ప్రశ్నించారు. దీంతో పవన్ సైతం కేంద్రం పై ఆగ్రహంగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఇండియా కూటమి నాయకులు పరామర్శ పేరిట చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే చంద్రబాబుకు బెయిల్ లభించిన తరువాత.. పరిణామాలు చూసి కీలక రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.