
గతంలో చంద్రబాబు ఎవరినైనా నేరుగానే ఎదుర్కొనేవారు. విమర్శలు చేయాల్సి వస్తే.. పార్టీ పేరు పెట్టి, టార్గెట్ చేసే వ్యక్తి పేరును కూడా ప్రస్తావించి మరీ మాట్లాడేవారు. తాను ప్రిపేర్ అయిన విషయాలన్నీ అంకెలతో సహా.. క్లియర్ కట్ గా వివరించేవారు. కానీ.. ఈ మధ్య ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అంటున్నారు.
జగన్ విషయంలో ఆయనలో ఎలాంటి మార్పూ లేదు. రాదు కూడా. ఎందుకంటే.. వైసీపీని, జగన్ ను తిడితేనే.. జనాలకు ఆయన మనసులోని మాటలు స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వంపై దాడిచేసే విషయంలో ఆయన యథావిధిగానే నడుస్తున్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు.
కానీ.. కేంద్ర ప్రభుత్వం విషయంలో మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఏ విషయంలో మాట్లాడాలో.. ఎంత వరకు మాట్లాడాలో అని లెక్కలు వేసుకొనిమరీ మాట్లాడుతున్నారని అంటున్నారు. సాధ్యమైనంత వరకూ కేంద్రంపై విమర్శలు చేయకుండా ఉండేలానే చూసుకుంటున్నారని అంటున్నారు. కొంత కాలంగా చర్చల్లో ఉన్న ఈ అభిప్రాయం.. తాజాగా బాబు మాట్లాడిన మాటలతో మరోసారి తేటతెల్లం అయ్యిందని చెప్పుకుంటున్నారు.
దేశంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఏకంగా ఇంటర్నేషనల్ మీడియా కూడా వరుస కథనాలు ప్రచురించింది. ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టొద్దు’’ అని అన్నారు. ఎవరిని అన్నారో తెలియకుండా.. పేరు చెప్పకుండా అనేశారు.
ఆ తర్వాత జగన్ పై విమర్శలు గుప్పించిన బాబు.. నేరుగానే దాడిచేశారు. మూర్ఖత్వంతోనే రాష్ట్రాన్ని దారుణ పరిస్థితుల్లోకి తీసుకెళ్లారు అంటూ డైరెక్ట్ అటాక్ చేశారు. అంటే.. ఈ లెక్కన పైన చేసిన వ్యాఖ్యలు మోడీ, అమిత్ షాను ఉద్దేశించే అని అంటున్నారు. నేరుగా అనలేక.. అసలు కేంద్రాన్ని ఏమీ అనలేదని బయటివాళ్లు అనుకోకుండా.. అలా మాట్లాడేశారని అంటున్నారు. ఈ తీరును బట్టి చంద్రబాబు భయపడుతున్నారా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. మరి, బాబు ఏమంటారో?