
కరోనా కండీషన్లో సినిమా తీయడం ఒకెత్తయితే.. యూనిట్ ను కాపాడుకోవడం మరో సవాల్ గా మారింది నిర్మాతలకు! ఎవరు ఎప్పుడు కొవిడ్ బారిన పడతారో తెలియని పరిస్థితి. ఒకరి నుంచి ఎంత మందికి సోకుతుందో చెప్పలేని పరిస్థితి. అందువల్ల.. సెట్లోకి రావడానికి ముందు, వచ్చిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి.
ఈ జాగ్రత్తలన్నీ పక్కాగా తీసుకొని సినిమా కంప్లీట్ చేసింది ‘లవ్ స్టోరీ’ యూనిట్! ఈ చిత్రం షూట్లో ఏ ఒక్కరు కూడా కొవిడ్ బారిన పడలేదు. దీనికి.. నటీనటులు, ఇతర సిబ్బంది తీసుకున్న జాగ్రత్తలు మాత్రమే కారణం కాదు. యూనిట్ అదనంగా తీసుకున్న సెక్యూరిటీస్ అన్నింటికన్నా ప్రధానం!
ఇందులో భాగంగా.. కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటించారు. అనవసరమైన వ్యక్తిని ఒక్కరిని కూడా సెట్లోకి అనుమతించ లేదు. కేవలం వంద మందితోనే షూటింగ్ కొనసాగించారు. ఇక, సెట్లో ఉన్నవారందరికీ నిత్యం బలవర్దకమైన ఆహారాన్ని అందించారట. ఏ మాత్రం తేడాగా కనిపించినా.. కొవిడ్ టెస్టులు చేయించారట.
అంతేకాదు.. సుమారు వంద మందికిపైగా ఇన్సూరెన్స్ చేయించారట. ఒక్కొక్కొరికి రూ.3 లక్షల మేర బీమా చేయించినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఈ కారణంగానే తమ యూనిట్లో ఎవరూ కొవిడ్ బారిన పడలేదని తెలిపింది. దీనికిగానూ రూ.50 లక్షలు అదనంగా ఖర్చయిందని ప్రకటించింది.
ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది ఖచ్చితంగా అందరూ అనుసరించాల్సిన పద్ధతిగానే కనిపిస్తోంది. ఇది ఒక అదనపు ఖర్చుగా పైకి కనిపించవచ్చు. కానీ.. కరోనా కారణంగా షూటింగులు వారాల తరబడి వాయిదా వేయాల్సి వస్తే.. ఇంకా చాలా నష్టం జరుగుతుంది. పైగా.. ఇది తరచూ సంభవించే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల.. ముందస్తుగానే మేల్కొంటే షూటింగ్ సజావుగా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. మరి, రాబోయే రోజుల్లో.. మిగిలిన యూనిట్లు కూడా ‘లవ్ స్టోరీ’ని ఫాలో అవుతారేమో చూడాలి.