Chandrababu – Pawan Kalyan Alliance: చంద్రబాబు, పవన్ ల కలయిక జగన్ పార్టీలో గుబులు రేపుతోంది. పొత్తు పొడుస్తుందేమోనన్న భయం పట్టుకుంది. వైసీపీ మంత్రుల ప్రకటనలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పెట్టని కోటలా మారిన సీమలో గండి పడుతుందన్న గుబులు మొదలయింది. 2019లో రాయలసీమ జగన్ కు జై కొట్టింది. 52 సీట్లలో 49 సీట్లను వైసీపీకి కట్టబెట్టింది. కానీ జగన్ సీమ జనానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు. సీమలో ఓ కొత్త పరిశ్రమ పెట్టిన పాపాన పోలేదు. ఓ రోడ్డు వేసిన పుణ్యం లేదు. ఉన్న పరిశ్రమల్నే ఉరికెత్తించిన ఘనత జగన్ పార్టీ నేతలది. ఇలాంటి తరుణంలో టీడీపీ, జనసేనల పొత్తు వైసీపీ కోటల్ని బద్ధలు కొట్టనుందా ? అన్న చర్చ మొదలైంది.

2014 ఎన్నికల్లో అనంతపురం మినహా మిగిలిన సీమ జిల్లాల్లో వైసీపీకి మంచి మెజార్టీ వచ్చింది. ఆ అనుభవంతో జగన్ అనంతపురంలో సామాజిక సమీకరణాల్ని పాటించారు. 2019 ఎన్నికలు మిగిలిన మూడు జిల్లాలతో పాటు అనంతపురం కూడ సులువుగా వైసీపీ ఖాతాలో పడిపోయింది. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ ప్రాబల్యం అధికంగా ఉంటుంది. రాజకీయంగా రెడ్డి సామాజికవర్గం ముందు వరుసలో ఉండటం జగన్ కు కలిసొచ్చిన అంశం. కానీ అనంతపురంలో బీసీల ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ బీసీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే ఒరవడిని 2024 ఎన్నికల్లో కూడ కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
2019కి ముందు ఉన్న పరిస్థితి ప్రస్తుతం లేదు. సీమలో సమీకరణాలు మారబోతున్నాయి. జనసేన, టీడీపీల పొత్తు అందుకు కారణం కాబోతోంది. 2019లో మూడు సీట్లతో సరిపెట్టుకున్నప్పటికీ టీడీపీకి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేయలేం. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడం సీమలో వైసీపీకి కలిసొచ్చింది. చాలా నియోజకర్గాల్లో ఓట్లు చీలడంతో వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకగా మారింది. కడప జిల్లాల్లోని మైదుకూరు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, జమ్మలమడుగు, కడప నియోజక వర్గాల్లో గెలుపోటముల్ని ప్రభావితం చేయగల సత్తా జనసేనకు ఉంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే వైసీపీ కోటకు బీటలు వారే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో కూడ సగం నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రజారాజ్యం నుంచి చిరంజీవి తిరుపతి నుంచి గెలిచారు. చాలా నియోజక వర్గాల్లో ప్రభావవంతమైన ఓటు బ్యాంకు జనసేనకు ఉంది. అనంతపురం జిల్లాలో కూడ టీడీపీ, జనసేన పొత్తు బలమైన ప్రభావం చూపుతుంది. ఇక్కడ టీడీపీ బలానికి జనసేన తోడైతే ఇక తిరుగు ఉండదు. ఒక్క కర్నూలు మినహా మిగిలిన మూడు జిల్లాల్లో జనసేన ప్రభావం గణనీయంగా ఉంటుంది. టీడీపీకి జనసేన ఓటు బ్యాంకు కలిస్తే సీమలో జగన్ ఆటలు సాగవు.

టీడీపీ, జనసేన పొత్తుతో అధికార పార్టీకి నష్టం తప్పదన్న సంగతి స్పష్టం అవుతోంది. దీంతో ఆఘమేఘాల పై వైసీపీ పెద్దలు విమర్శలకు దిగుతున్నారు. పవన్ పై అవాకులు చవాకులు పేలుతున్నారు. రెండు పార్టీల పొత్తు పొడవకుండా అరచేతిని అడ్డు పెట్టి ఆపాలనుకుంటున్నారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపగలమా ? అన్న ప్రశ్న వైసీపీ నేతలు వేసుకోవాలి.