తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భావించి ఇప్పటి నుంచే పార్టీని గాడిలో పెట్టే పనిలో పడిపోయారు. ఎలాగైనా పార్టీని విజయతీరాలకు చేర్చాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు సైతం పచ్చజెండా ఊపారు. కార్యకర్తలు, నేతల్లో నూతనోత్తేజం నింపే పనిలో భాగంగా వారితో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు సంసిద్ధమవుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో పార్టీ నష్టాల్లో పడింది. దీంతో పార్టీని పట్టాలెక్కించే పనిలో అధినేత ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారం కోల్పోయిన నేపథ్యంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో ఇలాగే ఉంటే పార్టీ పరువు పోవడం ఖాయమని గ్రహించిన బాబు దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడంతో పార్టీ సరైన దారిలో నడిపించే బాధ్యతను తన భుజాలపై ఎత్తుకునేందకు సిద్ధమయ్యారు. స్థానిక నేతల అభిప్రాయాలకు విలువ ఇచ్చి అక్కడ చేపట్టబోయే మార్పుల గురించి ఆరా తీస్తారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచనలు చేసి తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజులు ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక రోజు నియోజకవర్గ నేతలతో విడివిడిగా సమావేశం కావాలని అనుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఇన్ చార్జితో మాత్రమే కాకుండా ముఖ్యమైన నేతలతో సమావేశమై క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలపై సమాలోచనలు చేసేందుకు తయారు అవుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి గంట సమయం కేటాయించి వారి సమస్యలను పరిష్కరించి వారిలో ధైర్యం నూరిపోసే పని చేసేందుకు బాబు కార్యకర్తలకు ఉపదేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
పార్టీ బలంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లా నుంచే తన పర్యటన ఉండేలా నిర్ణయించుకుంటున్నారు. నాయకత్వ లోపం ఉన్న ప్రాంతాల్లో వారిని పార్టీ సేవలకు అంకితమయ్యేలా ఉద్బోద చేయనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాబు పర్యటన సందర్భంగా అక్కడ ఉన్న సమస్యలపై ఆందోళన చేసేందుకు కూడా పార్టీ నేతలు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.