చంద్రబాబు, పవన్ ల మధ్య నిన్న సాయంత్రం పొద్దు పోయాక సుదీర్ఘమైన భేటీ జరిగింది. పవన్ ఇంటికి వెళ్లి చంద్రబాబు చర్చలు జరిపారు. పదేళ్ల తర్వాత మాదాపూర్ లోని పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. నాదెండ్ల మనోహర్ సైతం పాల్గొన్నారు. రాత్రి పదిన్నర గంటల వరకు సాగిన ఈ భేటీకి సంబంధించి వివరాలను నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. ఎన్నికల వ్యూహం, ఏపీ భవిష్యత్తు గురించి ఇద్దరు నాయకులు చర్చించుకున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు అంశాలపైనే సంతృప్తికరంగా చర్చలు జరిగాయని.. త్వరలో వాటి వివరాలను వెల్లడిస్తామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
అయితే ఆ ఇద్దరు భేటీ ప్రధాన ఉద్దేశం బిజెపి పైనేనని.. అసలు బిజెపి తమతో కలిసి వస్తుందా? లేదా? వారు కలిసి రాకుంటే కాంగ్రెస్, వామపక్షాలను కలుపుకుని వెళ్లాలా? అన్నదానిపై చర్చించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటించింది. జనసేన ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉంది. అటు బిజెపి సైతం తాము జనసేనతో మాత్రమే కలుస్తామని చెబుతోంది. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసిన బిజెపి.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమవుతోంది. ఇన్ని పరిణామాల నడుమ ఏపీలో పొత్తుల వ్యూహంపై ఇరువురు నేతలు చర్చించడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతూ అధికార వైసిపి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గెలుపు కోసం తన ఇష్టమైన నాయకులను సైతం జగన్ పక్కన పెడుతున్నారు. మరికొందరికి స్థాన చలనం కల్పిస్తున్నారు. ఈ తరుణంలో మేల్కొనకుంటే.. సీట్ల సర్దుబాటు విషయంలో ఒక నిర్ణయానికి రాకుంటేనష్టం తప్పదని ఇరువురు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే టిడిపి తో కలిసేందుకు జనసేన స్థాయిలో బిజెపి మక్కువ చూపడం లేదు. అటు చంద్రబాబు సైతం ముస్లిం మైనారిటీ ఓట్లు దూరమవుతాయని బిజెపితో కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి రానున్న సంకేతాలు అందుతుండడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు.
త్వరలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజెపి ఆగ్రనేతలతో చర్చలు జరుపుతారని సమాచారం. అక్కడ నుంచి సానుకూలత రాకపోతే మాత్రం ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తారని తెలుస్తోంది. అవసరమైతే బిజెపిని వదిలించుకోవడానికి సిద్ధపడతారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. తాజా భేటీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రాథమికంగా ఒక అంగీకారానికి వచ్చారని.. మధ్యలో బిజెపి కలిస్తే మాత్రం కొంచెం మినహాయింపులు ఇచ్చుకోవాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ ఢిల్లీ పర్యటన అనంతరం మరోసారి సమావేశమై తుది నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. అయితే వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు అంశాన్ని తేల్చేయాలని ఇరువురు అధినేతలు భావిస్తున్నట్లు సమాచారం. జనసేనకు కేటాయించే సీట్లలో తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని.. వారిని మనస్ఫూర్తిగా పనిచేసేలా ఒప్పించాలని పవన్ చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కార్యాచరణ సైతం వేగవంతం చేయాలని.. ప్రజల్లోకి బలంగా వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం.