Chandrababu meets Vangaveeti Radha: ఏపీ రాష్ట్ర రాజకీయాలను కాపు సామాజిక వర్గం శాసిస్తుందని కొద్ది రోజుల నుంచి పలువురు అంటున్నారు. ఆ పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయి కూడా. ఇటీవల కాపు నాయకుల భేటీ జరగగా, తాజాగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత వంగవీటి రాధా ఇంటికి వెళ్లారు. ఈ విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రజెంట్ చర్చనీయాంశమవుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు, వంగవీటి రాధాతో భేటీ అవడంపైన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు రాధాను కలవడాన్ని, దివంగత మాజీ సీఎం సీనియర్ ఎన్టీఆర్ నాటి ఘటనతో పోల్చారు. రాధా తండ్రి దారుణ హత్యకు గురైన నేపథ్యాన్ని గుర్తు చేశాడు. ఆనాడు వంగవీటి రంగా దారుణ హత్యకు గురైనపుడు ఎన్టీ రామారావు సీఎం హోదాలో ఇంటికి వెళ్లారని, అప్పుడు ఆయన ఇంటికి గేట్లు వేశారని, గేట్లు మూసేసి ఉన్నాయని దాంతో రంగా కుటుంబ సభ్యులను పరామర్శించకుండానే సీనియర్ ఎన్టీఆర్ వెనుదిరిగారని పేర్కొన్నారు. కాగా, ఇప్పుడు వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు తన ఇంటి గేట్లు ఓపెన్ చేసే ఉంచారనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు అంబటి రాంబాబు.
Also Read: ‘మా’, మోహన్ బాబు ఎఫెక్ట్: చిరంజీవి సంచలన నిర్ణయం !
ఇటీవల వంగవీటి రాధా తనపై హత్యకు కుట్ర జరిగిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధా సంచలన కామెంట్స్‌పై చంద్రబాబు సోషల్ మీడియా వేదికగానైనా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. కాగా, తాజాగా చంద్రబాబు స్వయంగా స్వయంగా వంగవీటి రాధా ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమవుతున్నది. ఈ విషయమై అటు వైసీపీ కాని ఇటు టీడీపీ కాని డిఫరెంట్ గా స్పందిస్తున్నది.
వంగవీటి రాధా త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పేసి, వైసీపీలోకి వెళ్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాను బుజ్జగించడానికే చంద్రబాబు రంగంలోకి దిగారని కొందరు అంచనా వేస్తున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా వంగవీటి రాధాను కలిసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే, వంగవీటి రాధా వైసీపీలోకి వెళ్లడం ఖాయమనే వార్తలు కూడా వస్తున్నాయి.
కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత తమ పార్టీలోనే ఉండాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది. కాగా, వంగవీటి రాధాకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు పంపడానికే ఆయన ఇంటికి స్వయంగా చంద్రబాబు వెళ్లారని కొందరు పేర్కొంటున్నారు. మొత్తంగా వంగవీటి రాధాను టీడీపీ నుంచి బయటకు వెళ్లకుండా, కాపాడుకునేందుకుగాను ఆ పార్టీ అధినాయకత్వం ప్రయత్నిస్తున్నదని స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.