Chandrababu: చంద్రబాబు రాజకీయ చాణిక్యుడు. తాజా రాజకీయాలకు అనుగుణంగా పావులు కదపగలరు.అందుకు అనుగుణంగా నిర్ణయాలుతీసుకోగలరు. అయితే ఇది చాలా సందర్భాల్లో ఫలించాయి. మరికొన్ని సందర్భాల్లో వికటించాయి. తనకు ఇబ్బందులు ఎదురైన ప్రతిసారి అధిగమించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. రెండుసార్లు బిజెపితో పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకుని.. బిజెపి విషయంలో అడుగులు వేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాలు అంతగా అచ్చి రావడం లేదు. ఎంతో కొంత బలం ఉన్న కర్ణాటకలో సైతం మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చవిచూసింది. తెలంగాణ ఎన్నికల్లో సైతం ప్రభావ శీలిగా ఉండలేకపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లను పెంచుకుంది. బిజెపి ఒక్క హిందీ బెల్ట్ లో ప్రభావం చూపుతున్నా.. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం బిజెపి మైనారిటీ పాత్రే. అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి మాదిరిగా ఏకపక్ష విజయం దక్కే అవకాశం లేదు. అందుకే బిజెపి పునరాలోచనలో పడింది.
దక్షిణాది రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి కేరళలో ఒక్క స్థానం కూడా గెలిచే పొజిషన్ లేదు. కర్ణాటకలో సైతం మెజారిటీ సీట్లు దక్కే అవకాశం లేదు. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి బలమైన పొజిషన్లో ఉంది. తెలంగాణలో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉంది. ఏపీలో బిజెపి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో నెగ్గుకు రావడం ఎలా? అని బిజెపి ఆలోచన చేస్తోంది. ఈ తరుణంలోనే చంద్రబాబు తన రాజనీతిని బయటపెట్టారు. బిజెపికి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 ఎంపీ స్థానాలను గెలుచుకునే రాజమార్గం చూపించారు.
తెలంగాణ, ఏపీలో బిజెపితో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో టిడిపి సాదరంగా మద్దతు తెలిపి.. ఏపీలో 5 నుంచి 10 ఎంపీ సీట్లను బిజెపికి ఇచ్చేందుకు చంద్రబాబు డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో మద్దతుతో పాటు ఏపీలో పార్లమెంట్ స్థానాలను విడిచిపెట్టి.. అసెంబ్లీ సీట్లు మాత్రం జనసేనకు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలంటే బీజేపీకి చంద్రబాబు ఆఫర్ అనివార్యం అనిపిస్తోందని తెలుస్తోంది. అందుకే బిజెపి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరైన టైంలో చాణుక్యం చూపి చంద్రబాబు బిజెపిని తనవైపు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విశ్లేషకులు అభినందిస్తున్నారు. రాజకీయ వ్యూహం అంటే అలానే ఉండాలని వ్యాఖ్యానిస్తున్నారు.