Chandrababu: వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవోలాంటివి. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఒక వైపు పార్టీని బలోపేతం చేస్తూనే.. మరోవైపు పొత్తులతో ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నారు. అటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా దృష్టి పెట్టారు. ప్రధానంగా పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న కృష్ణా జిల్లాలో నేతల మధ్య విభేదాలు, నేతల నిర్లక్ష్యంపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. అక్కడ పార్టీ బాధ్యతలను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ పార్టీ రెండు నియోజకవర్గాల్లో గెలుపు సాధించింది. అటు విజయవాడ ఎంపీ స్థానాన్ని సైతం నిలబెట్టుకుంది. ఈసారి అక్కడ ఫలితాలు టీడీపీకి ఏకపక్షం వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో ఇటీవల వైసీపీ పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తుండడంతో అధినేత చంద్రబాబు కలవరపాటుకు గురవుతున్నారు. అందుకే సుతిమెత్తగా నేతలను హెచ్చరిస్తున్నారు. పార్టీ బాధ్యులు తీరు మారకుంటే తానే మారాల్సి వస్తోందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. టీడీపీ జిల్లాల సమీక్ష జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కృష్ణా జిల్లా సమీక్ష జరిగినప్పుడు చంద్రబాబు కాస్తా అసహనానికి గురయ్యారు. నేతల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలక సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని గైర్హాజరయ్యారు. అటు దేవినేని ఉమా, బొండా ఉమాలు విదేశాల్లో ఉండడంతో హాజరుకాలేకపోయారు.

గుడివాడ పై ఫోకస్..
ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు మింగుడుపడడం లేదు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. అందుకే వచ్చే ఎన్నికల్లోకొడాలి నానాని ఎలాగైనా ఒడించాలన్న కసితో చంద్రబాబు ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. అక్కడ టీడీపీ నేతల్లో అనైక్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాగైతే నానిని ఓడించడం సరికాదు కదా.. పోటీ ఇవ్వడం కూడా సాధ్యం కాదని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ కారణాలతో గుడివాడలో నిర్వహించతలపెట్టిన మినీమహానాడు వాయిదా వేశారు.అందుకే చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. గుడివాడ నియోజకవర్గంతో పాటు కృష్ణా జిల్లా బాధ్యతలు తానే చూస్తానని స్పష్టం చేశారు.ఈ నెల 12, 13 తేదీల్లో టీడీపీ జిల్లా పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించాలని ఉమ్మడి జిల్లాల నేతలకు ఆదేశించారు. నియోజకవర్గాల్లో విరివిగా పర్యటించాలని కూడా బాధ్యులకు సూచించారు.
Also Read: UK PM Liz Truss’ Cabinet : లిజ్ సంచలనం.. కేబినెట్ లో నాలుగు ముఖ్యమైన శాఖలు బ్రిటీషర్లు కాని వారికే..
కృష్ణా జిల్లాపై అలెర్ట్
గత కొంతకాలంగా కృష్ణా జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల పరిధిలో నేతల పనితీరు పేలవంగా ఉండడాన్ని చంద్రబాబు గుర్తించారు. అమరావతి ఎఫెక్ట్, ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుపొందుతామని నేతలు అతి ధీమాకు వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పట్టుబిగించేందుకు యత్నిస్తోంది. దీంతో చంద్రబాబు కృష్ణా జిల్లాపై ఫోకస్ పెంచాల్సి వచ్చింది. వాస్తవానికి ఇప్పటివరకూ లోకేష్ కృష్ణా జిల్లా వ్యవహారాలను చూస్తూ వచ్చారు. కానీ కృష్ణా జిల్లాలో టీడీపీలో అనైక్యత పెరుగుతోంది. నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మొదటికే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు.

గట్టిగానే క్లాస్..
ఇటీవల జరిగిన పరిణామాలు కూడా చంద్రబాబు స్వయంగా కలుగజేసుకోవడానికి కారణమయ్యాయి. గుడివాడలో నానిపై తెలుగు మహిళలు గట్టిగానే పోరాడుతున్నారు. కానీ ఇతర అనుబంధ విభాగాలు మాత్రం ఆ స్థాయిలో పరిణితి కనబరచడం లేదు. ఇటీవల విజయవాడలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి విషయంలో కూడా ఉమ్మడి జిల్లా నేతలు తగిన విధంగా స్పందించలేదని చంద్రబాబు వద్ద సమాచారం ఉంది. అందుకే నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగడానికి నిర్ణయించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు స్వీప్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే నేతలను ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంచేస్తున్నారు.
Also Read:Anchor Omkar Second Marriage: ప్రముఖ స్టార్ హీరోయిన్ తో రెండవ పెళ్ళికి సిద్దమైన యాంకర్ ఓంకార్..?