Chandrababu: చంద్రబాబు భయపెడుతున్నారా? భయపడుతున్నారా? ఎందుకు అభ్యర్థుల జాబితా ప్రకటించడం లేదు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటివరకు మూడు జాబితాలను ప్రకటించారు. 53 మంది అభ్యర్థులను మార్చారు. ఈ జాబితా 80 కి దాటుతుందని ప్రచారం జరుగుతోంది.అయితే ఆ స్థాయిలో టిడిపి అభ్యర్థుల ప్రకటన రాకపోవడంతో.. రకరకాల చర్చ నడుస్తోంది.
వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. అందుకే ఆ పార్టీ అభ్యర్థులను స్వేచ్ఛగా మార్చుకుంటుంది. చాలామంది నేతలకు స్థానచలనం కలిగిస్తోంది. మరికొందరిని పక్కన పెడుతోంది. అయితే ఈ మార్పులతో ఆ పార్టీకి చాలామంది నాయకులు గుడ్ బై చెబుతున్నారు. దాని పర్యవసానాలు ఎన్నికలపై చూపుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ సామాజిక సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ మార్పులు చేస్తున్నారు. అవసరమైతే తన సొంత సామాజిక వర్గం నేతలను సైతం పక్కన పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టి, బీసీ అభ్యర్థులకు పెద్దపీట వేస్తున్నారు. ఎన్నికల్లో ఈ ఫార్ములా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నారు.
అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగానే అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం చేస్తున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటిద్దామని పవన్ చెబుతుండగా.. చంద్రబాబు వద్దని వారించినట్లు తెలుస్తోంది. సామాజిక సాధికారత పేరుతో జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడాన్ని చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. జగన్ మార్పులు చేసిన నియోజకవర్గాల్లో బలమైన రాజకీయ నేపథ్యం, ఆర్థిక అండ, సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను నిలపాలని భావిస్తున్నారు. చంద్రబాబు వ్యూహాలు అంతుపట్టక జగన్ భయంతోనే అభ్యర్థులను మార్చుతున్నారని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. జగన్ పైకి మేకపోతు గాంభీర్యంతో ఉన్నారని.. లోలోపల మాత్రం ఓటమి భయంతో ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో అసలు చంద్రబాబుకు భయమే లేదని తేల్చి చెబుతున్నారు.