Chandrababu: ఈసారి కుప్పంతో పాటు ఆ నియోజకవర్గం నుంచి.. చంద్రబాబు రెండు చోట్ల పోటీ

1978లో తొలిసారిగా చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి రెండోసారి పోటీ చేసి టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

Written By: Dharma, Updated On : August 30, 2023 6:01 pm

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబు విషయంలో ఒక వార్త ఇటీవల హల్చల్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల ఆయన పోటీ చేస్తారన్నది దీని సారాంశం. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ.. చంద్రబాబు మాత్రం సీరియస్ గా ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఆయన రెండు చోట్ల పోటీ చేసిన దాఖలాలు లేవు. టిడిపి ఆవిర్భావం తర్వాత అధినేత ఎన్టీఆర్ రెండు, మూడు చోట్ల సైతం పోటీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ తరుణంలో చంద్రబాబు సైతం అదే ఫార్ములాను అనుసరించనున్నారని ప్రచారం జరుగుతోంది.

1978లో తొలిసారిగా చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి రెండోసారి పోటీ చేసి టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అటు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 1989లో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వరుసగా ఏడుసార్లు ఆయన గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి కుప్పం తో పాటు మరో నియోజకవర్గ నుంచి బరిలో దిగే ఛాన్సు అధికంగా ఉంది.

వాస్తవానికి కుప్పం టిడిపికి కంచుకోట. చంద్రబాబు పోటీ చేసిన ప్రతిసారి అక్కడ రికార్డు స్థాయిలో మెజారిటీ నమోదవుతూ వస్తుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంలో సైతం 40,000 మెజారిటీ ఎప్పుడూ తగ్గలేదు. అటువంటిది గత ఎన్నికల్లో 30 వేల మెజారిటీకి పడిపోయింది. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి పట్టు బిగించింది. దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును చావు దెబ్బ కొట్టాలన్న ప్రయత్నంలో ఉంది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆ నియోజకవర్గ ఇన్చార్జి భరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందితే మంత్రి పదవి కూడా కేటాయిస్తామని ప్రకటించారు. ఇవన్నీ ప్రభావం చూపితే వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా మరో నియోజకవర్గంలో దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది.

అయితే వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి చంద్రబాబు బరిలో దిగుతారని తెలుస్తోంది. గ్రేటర్ రాయలసీమలోని ఉమ్మడి ఆరు జిల్లాల్లో మొత్తం 74 సీట్లు ఉన్నాయి. దక్షిణ కోస్తా,ఉత్తర కోస్తా ఉభయగోదావరి జిల్లాలను కలుపుకుంటే 104 సీట్లు ఉన్నాయి.2014 ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమ కంటే మిగతా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి 80 శాతం సీట్లు లభించాయి. అందుకే ఈసారి అదే పట్టును కొనసాగించాలంటే గోదావరి జిల్లాల్లో చంద్రబాబు బరిలో దిగితే ఆ ప్రభావం సమీప జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబు ఎప్పుడు లేనంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అతి త్వరలో చంద్రబాబు పోటీ చేసే రెండో స్థానంపై క్లారిటీ రానుంది.