Keshineni Nani : విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ ను కలిశారు. వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎంపీ సీటు కోసం కాదని.. జగన్ ఏ బాధ్యత ఇస్తే.. దానిని నెరవేర్చుతానని ప్రకటించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా టిడిపి పై అసంతృప్తిగా ఉన్న కేశినేని నాని ఎట్టకేలకు వైసీపీలో చేరుతానని ప్రకటించడం విశేషం. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మరుక్షణం వైసీపీలో చేరతానని నాని వెల్లడించారు.
ఈరోజు సాయంత్రం సీఎం జగన్ కేశినేని నాని కలుసుకున్నారు. వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి తో కలిసి ఆయన జగన్ తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయన వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తో భేటీ తర్వాత కేశినేని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను వాడుకొని వదిలేశారని ఆరోపణలు చేశారు. 2013 నుంచి టిడిపి కోసం కష్టపడుతున్నానని.. అయినా సరే కనీసం ఆలోచించకుండా పార్టీ నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు పాదయాత్ర తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజంపై మోశానని కేసినేని నాని గుర్తు చేశారు. ఓ లక్ష్యంతో టీడీపీలో చేరానని.. అందుకు అనుగుణంగా పనిచేశానని.. ఏనాడు పదవులు ఆశించలేదని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం తన సొంత ఆస్తులను అమ్ముకున్నానని.. వ్యాపారంలో నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో అడిగితేనే కూతురు శ్వేతను పోటీలో దించానని.. కానీ ఎన్నికల అనంతరం ప్రెస్ మీట్ లు పెట్టి చంద్రబాబు తిట్టించారని… తనపై కొంతమంది నేతలను ఉసిగొల్పారని వాపోయారు. జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు మోసగాడు అని.. జగన్ నిరుపేదల పక్షపాతి అని.. అందుకే జగన్ తో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు కేశినేని నాని ప్రకటించారు.