Chandrababu: తెలుగుదేశం పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. మహానాడు సక్సెస్ కావడంతో వచ్చే ఎన్నికల్లో విజయంపై పార్టీ శ్రేణుల్లో నమ్మకం తొణికిసలాడుతోంది. కనివిని ఎరుగని రీతిలో మహానాడుకు టీడీపీ శ్రేణులు లక్షలాదిగా తరలిరావడంతో నేతలు సైతం ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇదే స్పూర్తిని మరో రెండేళ్లు కొనసాగితే విజయం పదిలం చేసుకోవచ్చన్న భావన అందరిలోనూ కలుగుతోంది. వాస్తవానికి మహానాడు ద్వారా అటు పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపడంతో పాటు పార్టీకి పునరుజ్జీవం తేవాలని చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. అందుకే మహానాడుకు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలపై ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం ద్వారా నాయకులు, కార్యకర్తలను ప్రజల మధ్యకు పంపించారు. తాను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఒక విధంగా చెప్పాలంటే బాదుడే బాదుడు కార్యక్రమం మహానాడు కు ఒక టానిక్ లా పనిచేసింది. అందుకే టీడీపీ శ్రేణులు స్వచ్ఛందంగా మహానాడుకు తరలివచ్చేలా చంద్రబాబు స్కెచ్ వేశారు. ప్రభుత్వం, పోలీసులు అడ్డుతగిలినా ఒంగోలులో మహానాడు దిగ్విజయంగా జరిగింది. మహానాడు వ్యూహం సక్సెస్ కావటంతో..వచ్చే ఎన్నికల వరకు ఇదే జోష్ ను కొనసాగిస్తూ..జిల్లాల పర్యటనలతో నేతలు – ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. అటు తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం గట్టి ఎదురుదెబ్బే కనిపించింది. దాదాపు టీడీపీ పని అయిపోయిందన్న వ్యాఖ్యలు వినిపంచాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ధైర్యం పోగుచేసుకొని ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు కలిసివస్తుండడం, పొత్తులు తెరపైకి రావడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం పెట్టుకొని పోరాడుతున్నారు.
Also Read: Gujarat Titans IPL 2022 Champion: ఐపీఎల్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఇంత ఈజీగా ఎలా గెలవగలిగింది?
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ జన్మదినం నాడు మహానాడును నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మహానాడుకు ముందే సంఘీభావంగా, సన్నద్ధతగా జిల్లాలు – నియోజకవర్గాల వారీగా మినీ మహానాడు నిర్వహించే వారు. అయితే, ఈ సారి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందుకే వచ్చే ఏడాది మహానాడు వరకు ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ప్రతీ జిల్లాలోనూ మినీ మహానాడు నిర్వహించి పార్టీ కార్యక్రమంతో పాటుగా.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.ప్రతీ పార్లమెంటరీ కేంద్రంలో మినీ మహానాడు నిర్వహణకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. మహానాడు వేదికగానే మినీ మహానాడు నిర్వహణ గురించి చంద్రబాబు ప్రకటన చేసారు. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత తిరిగి పార్టీ కేడర్ లో ఇప్పుడే జోష్ కనిపిస్తోంది. ఇది ఏ మాత్రం తగ్గకుండా వచ్చే ఎన్నికల వరకూ కొనసాగించేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
అదే ఊపుతో..
టీడీపీ శ్రేణుల్లో ఈ ఊపును కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రతి నెలా రెండు పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన పెట్టుకుని ఒక్కో జిల్లాలో మూడు రోజులు గడపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలా పది నెలల వ్యవధిలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అటు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సైతం మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉంది. అందుకే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మరింత చురుగ్గా చేపట్టాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
Also Read:Amalapuram Incident: మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగులబెట్టినా ఎందుకు చర్యల్లేవ్.? ఏంటి కథ?