తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో నానా తంటాలు పడుతున్నారు. పార్టీ కేడర్ ను కాపాడుకునే క్రమంలో పలు సమస్యలు ఆయన చుట్టుముడుతున్నాయి. ఓటు బ్యాంకుపై దృష్టి సారిస్తున్నారు. వైసీపీకి మళ్లిన ఓటర్లను తమ వైపు తప్పుకునేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. పార్టీని రాబోయే ఎన్నికల్లో గట్టెక్కించడానికి బాబు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారు పార్టీ కోసం ఖర్చు చేసేందుకు వెనకాడుతున్నారు. గత ఎన్నికల్లోనే బాగా ఖర్చు చేసి నష్టపోయామని చెబుతున్నారు. ప్రస్తుతం వ్యాపారాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నామని పేర్కొంటున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. తమ భవిష్యత్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే పార్టీకి కేడర్ అవసరం అని గుర్తిస్తున్నారు.
పరిషత్ ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టీడీపీ డైలమాలో పడింది. వైసీపీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలంటే సాధ్యం అవుతుందా అనే కోణంలో ఆలోచిస్తోంది. మరోవైపు వైసీపీ నేతలు ప్రతిపక్ష పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్న సందర్భంగా టీడీపీ నేతల్లో భయం పట్టుకుంది.
ప్రస్తుతం చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశం కావాలని భావిస్తున్నారు. జిల్లాల వారీగా ఇన్ చార్జీలత సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారు. పార్టీని గాడిలో పెట్టే పనిలో భాగంగా చంద్రబాబు టీడీపీ కేడర్ ను కాపాడుకునే ప్రయత్నంలో ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.