రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు సహజం.. కానీ.. సొంత పార్టీ నుంచి వస్తే మాత్రం అది ఖచ్చితంగా ఇబ్బందికరమే. ఇప్పుడు చంద్రబాబు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆయనకు.. పార్టీ నేతలు పలువురు చేస్తున్న వ్యాఖ్యలు, వారి వ్యవహారశైలి పంటికింద రాయిలా తగులుతున్నాయి. ఈ పరిస్థితి ముదిరినా.. మరికొన్నాళ్లు కొనసాగినా.. ఇబ్బంది తప్పదని బాబు గుర్తించారు. దీంతో.. సైకిల్ ను రిపేర్ చేసేందుకు సిద్ధమయ్యారు.
తిరుపతి ఉప ఎన్నిక ఫలితం మే 2న రానుంది. ఆ తర్వాత ఇక, ఎన్నికల గోల లేదు. దీంతో.. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని బాబు డిసైడ్ అయ్యారట. కరోనా తీవ్రత తగ్గిన వెంటనే జిల్లాల వారీగా సమీక్షలు చేయాలని భావిస్తున్నారట. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి.. అవసరమైతే నేతలను రీ-ప్లేస్ చేయాలని కూడా చూస్తున్నారట.
టీడీపీ అధికారం కోల్పోవడంతో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోయాయి. దీంతో.. వారిని తిరిగి కార్యోన్ముఖులను చేసేందుకు బాబు బాగానే ప్రయత్నించారు. కానీ.. పూర్తిగా కుదురుకోలేదు. పార్టీ రాష్ట్ర కమిటీని నియమించడం.. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జులను నియమించడం వంటివి చేశారు. కానీ.. అధికారం లేదు కాబట్టి మునుపటి జోష్ కనిపించలేదు.
పై పెచ్చు లోకేష్ పనికిరాడంటూ ఇన్నాళ్లూ బయటివాళ్లు కామెంట్ చేస్తే.. ఇప్పుడు సొంత వాళ్లు కూడా నోరు జారడం చేస్తున్నారు. దీంతో.. దీన్ని మొగ్గలోనే తుంచేయాలని చూస్తున్నారు బాబు. ఇందులో భాగంగా.. త్వరలో జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారట. తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల తర్వాత, కొవిడ్ కండీషన్ ను బట్టి.. రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సీనియర్లకు సూచించారట.
జిల్లా పర్యటనల ద్వారా ప్రజలను కలుసుకోవడంతోపాటు.. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయనున్నారట. ఎవరైనా సరిగా పనిచేయట్లేదని కనిపిస్తే.. వారిని పక్కన పెట్టి, కొత్తవారికి అవకాశం ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తారట. మొత్తానికి.. కేడర్ లో ఆశలు నింపి, పార్టీలో జవసత్వాలు నింపేందుకు నడుం కట్టారు బాబు. మరి, అది ఎంత మేరకు ఫలితం ఇస్తుందన్నది చూడాలి.