
విశాఖ పారిశ్రామిక వాడలోని రాంకీ ఫార్మాలో నిన్న జరిగిన ప్రమాదం అధికారపక్షం మరియు విపక్షాల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. వైజాగ్ లో జరుగుతున్న వరుస పారిశ్రమిక ప్రమాదాలకు వైసీపీ ప్రభుత్వ అలసత్వమే కారణం అని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వరుసగా మూడు భారీ ప్రమాదాలు వైజాగ్ లో రెండు నెలల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. ఎల్ జి పాలిమర్స్ లో జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం చోటు చేసుకోవడంతో పాటు, ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఆ తరువాత సాయినార్ పార్మా కంపెనీలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది.తాజాగా నిన్న రాంకీ పార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వలన పెద్ద ఎత్తున పేలుడు మరియు మంటలు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా కొందరు గాయాలపాలయ్యారు.
టీడీపీ మరో స్కాం వెలుగులోకి.. మాజీ మంత్రి బుక్
వైజాగ్ లో వరుస ప్రమాదాలు ప్రభుత్వ వైఫల్యమే అని ప్రతిపక్షం విమర్శిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఇందులో ఏదో కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాధ్ గుడివాడ, వైజాగ్ వరుస పారిశ్రామిక ప్రమాదాలు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలో భాగమే అని అంటున్నారు. అమరావతిని రాజధానిగా ఎలాగైనా కొనసాగేలా చేయడానికి ఉద్దేశ పూర్వకంగా ప్రమాదాలు సృష్టిస్తున్నారు అన్నారు. వైజాగ్ పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో భయాందోళను కలిగించాలని, వైజాగ్ రాజధానిగా పనికి రాదనే తప్పుడు అభిప్రాయాన్ని కలిగేలా చేయడానికి, ఈ ప్రమాదాలకు కుట్రపన్నారు అంటున్నారు. అమరావతి కోసం వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీయాలని చూస్తున్నారు అన్నారు.
వైసీపీ నేత ఆరోపణలతో రాష్ట్రంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఆయన ఆరోపణలో నిజం ఉన్నా లేకున్నా సంచలనం రేపుతున్నాయి. ఈ ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి కారకులకు శిక్ష పడేలా చేస్తాం అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే పారిశ్రామిక ప్రమాదాలు జరిగినట్లు మాట్లాడం సరికాదు అంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈస్ట్ గోదావరిలో ఓ ఎం జి సి గ్యాస్ పైప్ లైన్ లీకై 22 మంది కాలిబూడిదైన ఘటనను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఏదిఏమైనా విశాఖ ప్రమాదాలపై అధికార విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి.