వైసిపి ప్రజా ప్రతినిధులు ఇంటింటికి తిరిగి కరోనా వైరస్ వ్యాపింపజేయడం సరైందికాదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో అక్కడి వైసిపి ఎమ్మెల్యే ట్రాక్టర్లతో ఊరేగింపుగా ప్రదర్శన నిర్వహించారని, ప్రస్తుతం 13 మంది ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గుంటూరులో కూడా అదే జరిగిందన్నారు. ఆ రోజే మీ ఎమ్మెల్యే చేసిన దానిని నిలదీసివుంటే ఈ రోజు గుంటూరులో కొన్ని వందలమందికి కరోనా సోకేది కాదన్నారు. ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటుంటే మేమెలా సహకరిస్తామన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టడానికి ఒక నల్ల చట్టం తెచ్చారని అన్నారు. కేరళలో 2 నెలలకు సరిపోయే 17రకాల సరుకులు 95లక్షల కుటుంబాలకు ఇచ్చారని చెప్పారు. ప్రజలంతా భయపడుతున్న కనబడని శత్రువు కరోనా, అన్నిరకాల టచ్ పాయింట్ల ద్వారా శరవేగంగా విస్తరిస్తోందన్నారు. కారోనాకు నియంత్రణ ఒక్కటే దీనికి మార్గం అని, బైటనుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని క్వారంటైన్ చేయాలన్నారు. కేంద్రం లాక్ డౌన్ చేయకపోతే మనం మరింత విపత్కర పరిస్థితుల్లోకి వెళ్లేవాళ్లమని చెప్పారు.
మనదేశంలో 591మంది చనిపోయారని, మహారాష్ట్రలో కేసులు, మరణాలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. 53 మంది మీడియా ప్రతినిధులకు కూడా సోకిందన్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే ఏపిలో 76 కేసులు పెరిగాయని చెప్పారు
కరోనాను దాచిపెట్టినా, కావాలని కప్పెట్టినా, దానివల్ల కలిగే అనర్ధాల గురించి తొలినుంచి నేను హెచ్చరిస్తూనే ఉన్నానని తెలిపారు. నాతో సహా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంటే, వైసిపి వాళ్లు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో ఆన్ లైన్ లో ఒక సమావేశం పెట్టండి. మీకు నచ్చిన అధికారులు, మేధావులను పిలవండి, అభిప్రాయాలు తీసుకోండని చెప్పినా ఈ ప్రభుత్వం లెక్క పెట్టలేదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం, వాళ్ల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని, ఒక బాధ్యతగా ప్రవర్తించాలన్నారు.
చాలా రాష్ట్రాలు అనేక ల్యాబ్ లను పకడ్బందీగా నిర్వహిస్తున్నాయని, పకడ్బందీగా టెస్టింగ్ లు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఎందుకు గందరగోళం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపిలోని 13 జిల్లాలలో 11 రెడ్ జోన్ లో ఉన్నాయని, ఎక్కడికక్కడ పరీక్షలు చేసి హాట్ స్పాట్లపై ప్రత్యేక శ్రద్ద పెడితే తప్ప దీనిని నివారించలేమని చెప్పారు.
డాక్టర్లకు ఇచ్చే పిపిఈలు సురక్షితమైనవైనా, వైద్యులకు ఇచ్చే రక్షణ పరికరాలపై నిర్లక్ష్యం చేశారన్నారు. కరోనా రోగికి చికిత్స చేసినందుకు నెల్లూరులో డాక్టర్ కు కూడా సోకిందని, చివరికి ఆయన చికిత్స కోసం చెన్నై వెళ్లారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా సోకింది. చెన్నైలో ఆయన చనిపోతే మృతదేహాన్ని కూడా స్వగ్రామానికి తెచ్చే పరిస్థితి లేదని, ఆ డాక్టర్ అంత్యక్రియలు కూడా అక్కడే చేయాల్సి వచ్చిందని చెప్పారు. కర్నూలు జిల్లాలో ఎందుకీ పరిస్థితి వచ్చిందని, అక్కడ పేదల డాక్టర్ కూడా కరోనా రోగికి చికిత్స చేసి చనిపోయాడని చెప్పారు. రాష్ట్రంలో పిపిఈలన్నీ ఒక పద్దతి ప్రకారం ఉన్నాయా, డాక్టర్ల గౌన్లు, మాస్క్ లు రక్షణ ఇచ్చేవేనా, వాటి నాణ్యత పరీక్షించారా అని ప్రశ్నించారు. వీటన్నింటిపై ప్రాపర్ ఆడిటింగ్ చేయాలని, క్వాలిటీ టెస్ట్ చేయాలని సూచించారు. వీళ్లంతా కరోనాపై పోరాడే ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది గుర్తుంచుకోవాలన్నారు. నిన్న ఒక ఏఎస్ ఐ చనిపోయాడని, కరోనా రోగులను కాపాడేందుకు తమ ప్రాణాలు త్యాగాలు చేసేందుకు కూడా సిద్దపడిన వాళ్లను రక్షించే విధానం ఇదేనా అని ప్రశ్నించారు.
మొన్న ఆరోపణలు చేసి, ఇప్పుడు మా విజన్ మెడ్ టెక్ జోన్ ఎలా అంటారన్నారు. ఏ2 ఇష్టానుసారం అందరి గురించి మాట్లాడతారని, మెడ్ టెక్ జోన్ మా విజన్, దీని ద్వారా దేశానికే సరఫరా చేస్తున్నాం అన్నా విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ రోజు సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ప్రశ్నించారు.
కరోనా కిట్ల కొనుగోళ్లలోనూ కక్కుర్తి పడతారా, ఒక్కో కిట్ రూ. 730కు కొన్నారని, అదే కిట్ చత్తీస్ గఢ్ ప్రభుత్వం సేమ్ బ్రాండ్ సేమ్ కంపెనీ కిట్ రూ. 337 ధరకు తెప్పించిందన్నారు. ఇప్పుడు పట్టుబడినాక తగ్గిస్తామని అనడం ఎంత వరకూ సమంజసమన్నారు. ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏం న్యాయమని, ప్రభుత్వ పిలుపును గౌరవించి ప్రజలు లాక్ డౌన్ పాటిస్తుంటే, వాళ్ల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం ఇదేనా చేసేదిని ప్రశ్నించారు.
రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ఆక్వా ఉత్పత్తులకు, హార్టీ కల్చర్ ఉత్పత్తులకు ధర లేదన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ప్రభుత్వమే కొని రైతు బజార్లలో, మొబైల్ రైతుబజార్లలో అమ్మవచ్చని సలహా ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్య లకు ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. సీఎం హామీలు కేవలం ప్రకతనాలకే పరిమితం అయ్యాయని చెప్పారు. టిడిపి, బిజెపి, జనసేన ఏ పార్టీ నాయకులు మాట్లాడినా వాళ్లపై విమర్శలు గుప్పించారన్నారు. మొన్న కన్నాపై, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారని చెప్పారు.
ఈ రోజు కొవ్వూరులో యూపి నుంచి వచ్చిన వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలలో మన వలస కార్మికులను ఆదుకోమని లేఖలు రాస్తున్నాం. వాటికి స్పందించి అక్కడి రాష్ట్రాలు ఆదుకుంటున్నాయని, ఇక్కడ ఉండే వలస కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా అని ప్రశ్నించారు. క్వారంటైన్ కేంద్రాల్లో చనిపోవడం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. క్వారంటైన్ లో ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తే వాళ్లకు పాజిటివ్ బైటపడితే ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రత్యేక చికిత్స ఇవ్వాలన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట లో, పెడనలో, చింతలపూడి మండలంలో చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి విద్యార్ధులు ఏపికి వస్తే వాళ్లను లాఠీఛార్జ్ చేసి తరిమేశారని, అలాంటిది ప్రభుత్వమే చెన్నై నుంచి కనగరాజ్ ను అంబులెన్స్ లో ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ప్రతిరోజూ ఛైర్మన్ ల నియామకం చేస్తున్నారని ఎందుకంత ఆతృత చెప్పాలన్నారు. 15 శాతం మందికి సోకితే మన దగ్గర వాళ్లందరికీ ఆసుపత్రులు ఉన్నాయా అని ప్రశ్నించారు.