చంద్రబాబు నిజంగా సొంత తెలివితేటలతోనే రాజకీయాలలో ఇంతగా ఎదిగాడా అనే డౌట్ కొడుతుంది. ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఇదే సందేహం కలుగుతుంది. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు, నిర్ణయాలు ఆయనకు మరియు పార్టీకి మరింత నష్టం చేకూర్చేవిగా ఉంటున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం గవర్నర్ ఆమోదంతో చట్టబద్ధం అయ్యింది. ఇక జగన్ వైజాగ్ కి రాజధానిని తరలించడమే తరువాయి. ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా వైజాగ్ మారనుంది. చంద్రబాబు మాత్రం అమరావతిపై పట్టువదిలేది లేదు అంటున్నారు. అమరావతిని కాపాడుకోవడానికి ఎంత వరకైనా వెళతానని అంటున్నారు.
రాజధాని రైతుల ఉద్యమాలు, టీడీపీ ఆరోపణలు ఏమాత్రం సానుభూతే లేని పక్షంలో, ప్రజల్లో అభద్రతా భావం కలుగజేయాలని చూస్తున్నారు. 2024 లో ప్రభుత్వం మారితే మరలా రాజధాని మారదని గ్యారంటీ ఏమిటని, ఆయన కొత్త సమస్యను లేవనెత్తారు. అలా 2024ఎన్నికల తరువాత మరో ప్రభుత్వం వస్తే మరలా అమరావతి రాజధాని విషయం తెరపైకి రావడం, అభివృద్ధి కుంటుబడటం ఖాయం అంటున్నారు. బాబు తెరపైకి తెస్తున్న ఈ అంశం ఎవరికి బాగా నష్టం కలిగిస్తుందో, కనీస రాజకీయ అవగహన ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. టీడీపీ వస్తే మరలా అమరావతిని రాజధానిగా చేయడం ఖాయం. అంటే ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రజలకు అన్యాయం జరగడం అనివార్యం. ప్రభుత్వం మారితే రాజధాని కథ మరలా మొదటికి వస్తుంది, మరో ఐదేళ్లు శాశ్వత రాజధానిని అభివృద్ధి చేసుకొనే అవకాశం ప్రజలు కోల్పోతారు. ఈ విషయాన్ని పరోక్షంగా టీడీపీ చెవుతున్న వేళ అసలు ఆ రెండు ప్రాంతాల ప్రజలతో పాటు, న్యూట్రల్ గా ఉన్న గోదావరి జిల్లాలు మరియు ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఓటర్లు బాబుకు ఓటేయడానికి భయపడతారు. మళ్ళీ జగన్ నే గెలిపించుకోవాలి అనుకుంటారు.
ఇక బాబు అమరావతి ఉద్యమానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి గుంటూరు, కృష్ణా జిల్లాల ఓటర్లు బాబుకు మాత్రమే ఓటేస్తారు అనడంలో సందేహం లేదు. మూడు రాజధానుల ప్రతిపాదనతో ఎటూ జగన్ ఈ రెండు జిల్లాల ఓటర్లలో వ్యతిరేకత తెచ్చుకున్నారు. కాబట్టి బాబు విమర్శ వలన జగన్ కు కొత్తగా వచ్చిన నష్టం లేదు. కాగా 2024 మేము అధికారంలోకి వస్తే తిరిగి అమరావతినే రాజధానిగా చేస్తాను అని బాబు పరోక్షంగా చెప్పడం ద్వారా మిగతా 11 జిల్లాలపై పట్టుకోల్పోతున్నారు.