Chandrababu: చంద్రబాబు సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యం ఇవ్వనున్నారా? అన్ని వెనుకబడిన కులాలకు సంఘటితం చేయనున్నారా? కీలక నియోజకవర్గాల్లో బీసీ నేతలను బరిలో దింపనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాయలసీమలో సోషల్ ఇంజనీరింగ్ పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి కీలక నియోజకవర్గాల్లో బీసీలను రంగంలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైతే నేతలను పక్క నియోజకవర్గాలకు సైతం పంపించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ ఇదే మాదిరిగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దానిని చంద్రబాబు అనుసరించనున్నట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో బీసీ ప్రయోగం చేయాలని బాబు భావిస్తున్నారు. ఇప్పటివరకు కర్నూలు ఎంపీ స్థానానికి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. అయితే రాష్ట్ర విభజనతో అక్కడ సీన్ మారింది. 2014, 2019 ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకుంది. 2014లో బుట్టా రేణుక, 2019లో డాక్టర్ సంజయ్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు. వారిద్దరూ బీసీలు కావడం గమనార్హం. అందుకే ఈసారి బీసీలను టిడిపి బరిలోకి దించితే బిగ్ ఫైట్ ఉంటుందని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానంపై కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం ఆశలు పెట్టుకుంది. అయితే వారికి వేరే అసెంబ్లీ స్థానాన్ని సర్దుబాటు చేసి.. కర్నూలు లోక్ సభ స్థానం నుంచి కురుబ సామాజిక వర్గానికి చెందిన నేతను ప్రయోగించేందుకు దాదాపు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కర్నూలులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబానిది సుదీర్ఘ చరిత్ర. జిల్లాను శాసించింది ఆ కుటుంబం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనంతరం ఆయన కుమారుడు సూర్యప్రకాశ్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004, 2019 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా గెలుపొందారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఓటమి ఎదురు కావడంతో టిడిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో తన కుమారుడిని ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే చంద్రబాబు ఆలోచన వేరే విధంగా ఉంది.
కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీ స్థానంతో పాటు జిల్లాలో ఓ అసెంబ్లీ స్థానాన్ని కోరుకుంటుంది. అయితే రెండు చోట్ల ఆ కుటుంబానికి టికెట్లు ఇవ్వడం ఈసారి కష్టమని టిడిపి వర్గాల నుంచి వినిపిస్తోంది. సూర్య ప్రకాశ్ రెడ్డి కుమారుడు రాజకీయ అరంగేట్రం చేయనుండడంతో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కోట్ల కుటుంబం వైసీపీలో చేరుతుందని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. టిడిపిలోనే వారు కొనసాగారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారిని మారుస్తామన్న ప్రతిపాదన పై వారు ఎలా స్పందిస్తారో చూడాలి. కానీ రాయలసీమ వ్యాప్తంగా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేసి దాదాపు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.