Chandrababu : ఆమె సహకారంతో జీవీఎల్ కు చంద్రబాబు చెక్

జీవీఎల్ నరసింహంకు చెక్ చెప్పడంతో పాటు బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ కు లైన్ క్లియర్ చేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం ఇది అని ప్రచారం జరుగుతోంది. అందుకు బిజెపి పరంగా పురందేశ్వరి సహకరించారని కూడా టాక్ నడుస్తోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.

Written By: NARESH, Updated On : March 22, 2024 8:08 pm

Chandrababu

Follow us on

Chandrababu : బిజెపి సీనియర్ నేత జివిఎల్ కు చంద్రబాబు దెబ్బేశారు. గత ఐదేళ్లుగా జీవీఎల్ చేసిన ఇబ్బందులకు గట్టిగానే షాక్ ఇచ్చారు. టిడిపి 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో జీవీఎల్ ఆశిస్తున్న విశాఖ పార్లమెంట్ స్థానం కూడా ఉంది. గత కొన్నేళ్లుగా జీవీఎల్ విశాఖలో మకాం పెట్టారు. ఇక్కడే ఒక ఇంటిని అద్దెకు తీసుకుని రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. పొత్తులో భాగంగా విశాఖ పార్లమెంట్ స్థానం కచ్చితంగా దక్కుతుందని.. తాను ఎంపీగా పోటీ చేయడం ఖాయమని నమ్మకం పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారం విశాఖ పార్లమెంట్ స్థానాన్ని టిడిపి దక్కించుకునేలా చేశారు. గత 24 సంవత్సరాలుగా విశాఖ ఎంపీ స్థానం టిడిపి చేతిలోకి రాలేదని… ఈసారి తమకు విడిచి పెట్టాలన్న విజ్ఞప్తిని బిజెపి కూడా అంగీకరించింది. ఈ విషయంలో బాలకృష్ణ చిన్నల్లుడుకి లైన్ క్లియర్ చేయాలని పురందేశ్వరి సైతం సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది.

విశాఖ పార్లమెంట్ స్థానానికి శ్రీ భరత్ పేరు ఖరారు అయింది. ఈయన బాలకృష్ణ చిన్న అల్లుడు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనుమడు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. కానీ గత కొన్ని నెలలుగా బిజెపి నేత జివిఎల్ విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. పొత్తులో భాగంగా విశాఖ నుంచి పోటీ చేస్తానని భావించారు. అయితే టిడిపి విషయంలో జీవీఎల్ వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉండేది. ముఖ్యంగా బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేసే ప్రయత్నాలను చాలా వరకు జీవీఎల్ అడ్డుకున్నారు. మరోవైపు పురందేశ్వరి నాయకత్వాన్ని సైతం జివిఎల్ వ్యతిరేకించడం ఆయనకు మైనస్ గా మారింది. ఈ పరిణామాల క్రమంలో ఆయనకు విశాఖలో ఛాన్స్ లేకుండా చేశారు.

టిడిపి బిజెపితో పొత్తు అంటే ముందుగా గుర్తుకొచ్చేది విశాఖ పార్లమెంట్ స్థానమే. పొత్తులో భాగంగా చాలాసార్లు ఈ స్థానాన్ని బిజెపి దక్కించుకునేది. ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ అధికం. హెచ్పీసీఎల్ తో పాటు నావెల్ డాక్ యార్డ్ వంటి సంస్థలు ఇక్కడ ఉంటాయి. ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు. అందుకే ఇక్కడ బిజెపి సునాయాస విజయం దక్కించుకునేది. జాతీయస్థాయి పార్టీగా కాంగ్రెస్ ఉండడంతో.. ఆ పార్టీ సైతం పలుమార్లు గెలుపొందుతూ వచ్చింది. అయితే 1999 తర్వాత ఈ పార్లమెంట్ స్థానాన్ని టిడిపి గెలుచుకోలేదు. అందుకే ఈసారి చంద్రబాబు పట్టుబట్టి మరి ఈ స్థానాన్ని పొందగలిగారు. జీవీఎల్ నరసింహంకు చెక్ చెప్పడంతో పాటు బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ కు లైన్ క్లియర్ చేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం ఇది అని ప్రచారం జరుగుతోంది. అందుకు బిజెపి పరంగా పురందేశ్వరి సహకరించారని కూడా టాక్ నడుస్తోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.