దేశ రాజకీయాల్లో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించారు. పార్టీలను ఏకతాటిపైకి తేవడంలో బాబు పాత్ర చురుకైనదే. అయినా ఇప్పుడు మాత్రం జాతీయ రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదు. ఎందుకంటే బీజేపీతో పెట్టుకుంటే అంతే సంగతి అనే విషయం తెలియడంతో బాబులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో థర్డ్ ఫ్రంట్ నినాదం ఊపందుకోవడంతో నాయకుల చూపు అటు వైపు మరలుతోంది.
కానీ బాబు మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అన్నమాదిరిగా బాబు ప్రవర్తన ఉందని చెబుతున్నారు. మూడో కూటమితో ప్రయోజనం పొందాలని ఎన్సీపీ నేత శరత్ పవార్, పశ్చిమ బెంగాల్ మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నా మన బాబు మాత్రం రాముడు మంచి బాలుడు అన్న విధంగా ఉంటున్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న కేసీఆర్ కూడా నోరు మెదపడం లేదు.
థర్డ్ ఫ్రంట్ కు కేసీఆర్ తోపాటు జగన్, స్టాలిన్ ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో వీరిలో ఏదో భయం పట్టుకుందని తెలుస్తోంది. అవసరమైనప్పుడు పనులు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు పరిస్థితులను బట్టి మారుతుంటారు. థర్డ్ ఫ్రంట్ అవసరం అనుకుంటే దూకుతారు.
కానీ బీజేపీతో వైరం కారణంగా అధికారానికి దూరమైన నేపథ్యంలో ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో మోడీ చరిష్మా తగ్గి అధికారం రాదనుకుంటే ఊసరవెళ్లి రంగులు మార్చినట్లుగా ప్రత్యర్థి శిబిరంలోకి సులువుగా దూకేస్తారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ విషయంలో జోక్యం చేసుకునేందుకు ఎవరు ముందుకు వస్తారో వేచి చూడాల్సిందే.