TDP Janasena Alliance: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహం సిద్ధం చేస్తున్నాయి. సీఎం జగన్ దూకుడు మీద ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. దీంతో వైసీపీ నుంచి చాలామంది నాయకులు బయటకు వెళ్తున్నారు. టిడిపి, జనసేనలో చేరుతున్నారు. మరికొందరు చేరేందుకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చి చర్చలు జరిపారు. కీలక అంశాల విషయంలో ఒక స్పష్టతకు వచ్చారు. ఈ రెండు నెలలు కీలకమని.. వీలైనంత వరకు రెండు పార్టీల మధ్య సమన్వయంతో వెళితేనే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.
సుమారు నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో పాటు టిడిపి నాయకుడు నారా లోకేష్ సైతం ఈ చర్చల్లో పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు, ఉమ్మడి మేనిఫెస్టో, కార్యాచరణ వంటి అంశాలపై లోతైన చర్చ నడిచింది. ఇప్పటికే ప్రాథమికంగా సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశంలో అది కూడా చర్చకు వచ్చింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మలుచుకోవాలని.. ఉమ్మడి కార్యాచరణ అనేది స్ట్రాంగ్ గా ఉండాలని ఇరు పార్టీల నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చాలా అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా 12 అంశాలతో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టోకు తుది రూపాన్ని ఇచ్చారు. వీలైనంత త్వరగా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మేనిఫెస్టోను విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఇప్పటికే టిడిపి ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి సంవత్సరం 15000 రూపాయలను తల్లుల ఖాతాలో జమ చేస్తారు. మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు సాయం, అన్నదాత పథకం కింద రైతులందరికీ ఏడాదికి 20వేల రూపాయల సాగు ప్రోత్సాహం, యువ గళం కింద ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయల ఆర్థిక సాయం, ఇంటింటికి కుళాయి పథకం అంటూ 6 పథకాలను టిడిపి ప్రకటించింది. వీటికి జనసేన ప్రతిపాదించిన మరో ఆరు పథకాలను జత చేసి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయడానికి ఇరు పార్టీల నేతలు అంగీకారం తెలిపారు. వీలైనంత త్వరగా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించి.. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.