Mahanadu: పసుపు పండుగ మహానాడు ఈసారి సంచలనాలకు వేదిక కానుందా? కీలక రాజకీయ నిర్ణయాలుంటాయా? టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో ముందే ప్రకటించనున్నారా? వైసీపీలో నుంచి భారీ చేరికలకు ప్లాన్ చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ హైకమాండ్ భారీగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత కకావికలమైన టీడీపీలో జవసత్వాలు నింపింది గత ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడే. కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు యాక్టివయ్యాయి.
రాజమండ్రిలో ఏర్పాట్లు
అయితే ఈసారి గోదావరి జిల్లాల ముఖ ద్వారమైన రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 27,28 తేదీల్లో మహానాడు నిర్వహణ ఉంటుంది. కాగా ఎన్నికల ేడాది కావడంతో పనిలోపనిగా ప్రజలకు ఏం చేయబోతున్నామో కూడా ముందుగానే తెలపనున్నారు. చంద్రబాబు ముగింపు ప్రసంగంలో అనేక హైలెట్స్ ఉండేలా చూస్తున్నారు. పొత్తుల విషయంలో కూడా స్పష్టమైన ప్రకటన చేసే చాన్స్ ఉంది. ఏ స్థాయిలో ఉండబోతున్నాయో కూడా స్పష్టత ఇచ్చే అవకాశమున్నట్టు ప్రచాం సాగుతోంది.
వైసీపీ నుంచి చేరికలు
అయితే వీటిన్నింటికీ మించి వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి భారీ చేరికలకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. వారితో పాటు మరికొందరు అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వారందర్నీ టీడీపీలోకి రప్పించి జగన్ కు గట్టి షాకే ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి చేరికలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ రెండు జిల్లాలు పెట్టని కోటలుగా నిలుస్తున్నాయి. ఇప్పుడదే జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవాలని చంద్రబాబు వ్యూహాలు రూపొందిస్తున్నారు.
కోటంరెడ్డి హాట్ కామెంట్స్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు రోజుల క్రితం రాజమండ్రీ వచ్చి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు.అంతే కాదు ఆయన ఒక అరగంటకు పైగా స్థానిక ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ విషయం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా కోటం రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కానీ జనసేన కానీ టికెట్ ఇస్తామని హామీ ఇస్తే మాత్రం వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని. మరి కోటం రెడ్డి ఊరికే ఆ మాటలు అన్నారా లేక రాజకీయంగా వీటికి ప్రాధాన్యత ఉందా అన్న దాని మీద కూడా అంతా చర్చిస్తున్నారు.ఏది ఏమైనా ఈసారి మహానాడుతో ఏపీ రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారు. దానికి తగినట్లుగా ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంటున్నారు.