Kodali Nani: అలూ లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది ఏపీలో అధికార పక్షం నాయకుల ఆలోచన. టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని.. ఇప్పటికే సీట్ల పంపకం పూర్తయ్యిందని.. ఎప్పటి నుంచో మేము అనుమానిస్తున్నదే నిజం అయ్యిందని చెబుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అయితే జనసేనకు 45 స్థానాలు కేటాయించారని చెబుతున్నారు. అయితే ఎన్నికలన్నాక పార్టీల మధ్య పోరాటం ఉంటుంది. పొత్తులు,వ్యూహాలు ఉంటాయి. అంతెందుకు గత ఎన్నికల్లో తాము ఒంటరి పోరాటంతో ఏకపక్ష విజయం సొంతం చేసుకున్నామని వైసీపీ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు. నిజమే ఏ పార్టీ మీతో కలిసి రాలేదు.. కానీ చాలా పార్టీలు, వ్యవస్థలు, వ్యక్తులు ఇంటర్నల్ గా పనిచేశాయి. రాజకీయ పార్టీతో సమానమైన ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ బృందం కూడా సహకరించింది. ప్రజలను వర్గాలు, కులాలు, మతాలుగా విభజించి మరీ వారిని వైసీపీ గూటికి చేర్చిన ఘనత పాపం పీకేదే. కానీ ఎప్పుడూ సింగిల్ గా వచ్చాం.. వందలాది సీట్లు సాధించామన్న మాటను మాత్రం వైసీపీ నేతలు మరిచిపోలేకపోతున్నారు.

తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ పై రెక్కి నిర్వహిస్తున్నారన్న వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ లో ఆయన నివాసం వద్ద తరచూ కొంతమందివ్యక్తులు కనిపించి అక్కడికి వచ్చే వారి వివరాలు ఆరా తీస్తున్నారని.. ఈ క్రమంలో అక్కడున్న సిబ్బందితో తరచూ గొడవపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఏపీ సీఐడీ అధికారుల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తెలంగాణ జనసేన నాయకులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కూడా కొనసాగుతోంది. మరోవైపు పవన్ కు ప్రాణ హాని ఉందని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అయితే తాజాగా ఈ ఇష్యూపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తనదైన శైలిలోవిశ్లేషించారు. పవన్ కు చంపాలని ఎవరికి ఉంటుంది నా బొ…ఉంటే గింటే చంద్రబాబు ఆ పని చేయిస్తాడని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులో పవన్ 45 స్థానాలు అడిగాడని.. అది ఇష్టం లేని చంద్రబాబు పవన్ ను చంపించాలని డిసైడ్ కు వచ్చాడని తన మార్కు విశ్లేషణతో నాని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు కోటరీ పవన్ చుట్టూ చేరిపోయిందని కూడా జనసైనికులకు హింట్ ఇస్తున్నారు. అయితే దీనిపై నెటిజెన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య, కోడి కత్తి కేసు..వీటన్నింటిలో చంద్రబాబు పేరే చెప్పారని.. ఇప్పుడు కూడా అదే అలవాటులో పవన్ ను కూడా చంద్రబాబే చంపిస్తారని చెబుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి కొడాలి నాని విలక్షణ విశ్లేషణలతో తెలుగునాట మంచి ప్రాచుర్యమే తెచ్చుకుంటున్నారు.