https://oktelugu.com/

Chandipura Virus : కలకలం సృష్టిస్తున్న కొత్త మహమ్మారి.. గుజరాత్ లో మరణిస్తున్న చిన్నారులు.. అసలు ఏంటి వైరస్.. ఎలా వ్యాపిస్తుంది?

గుజరాత్ లో ‘చాందీపురా వైరస్’ కారణంగా ఇప్పటి వరకు 8 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ ప్రకటించారు. ఆయన గాంధీనగర్ లో మంగళవారం మాట్లాడారు. రాష్ర్టంలోని రాజ్ కోట్, సబర్ కాంత, మహిసాగర్, ఖేడా, మెహసానా, ఆరావళి, తదితర జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి కనిపించినట్లు మంత్రి చెప్పారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 17, 2024 / 04:29 PM IST
    Follow us on

    Chandipura Virus : గుజరాత్ లో ఒక వైరస్ భయాందోళనలకు కారణమవుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది చిన్నారులను బలితీసుకుంది. ఆ రాష్ట్రంలో తీవ్రంగా వ్యాపిస్తున్న ‘చాందీపురా వైరస్’ తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 15 కు చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

    ఈ వైరస్ కారణంగా మంగళవారం (జూలై 16) మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పలు జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. కొత్త కేసుల నమోదుతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. వైద్యారోగ్యశాఖ యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. పారిశుధ్య చర్యలకు పాల్పడుతోంది. గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలను కూడా అధికారులు పర్యటించి సూచనలు చేస్తున్నారు.

    గుజరాత్ లో ‘చాందీపురా వైరస్’ కారణంగా ఇప్పటి వరకు 8 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ ప్రకటించారు. ఆయన గాంధీనగర్ లో మంగళవారం మాట్లాడారు. రాష్ర్టంలోని రాజ్ కోట్, సబర్ కాంత, మహిసాగర్, ఖేడా, మెహసానా, ఆరావళి, తదితర జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి కనిపించినట్లు మంత్రి చెప్పారు. అయితే రాజస్థాన్ నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్ నుంచి ఒకరు ఈ వైరస్ బారిన పడి తమ రాష్ర్టంలో చికిత్స కోసం వచ్చినట్లు తెలిపారు.

    ఇందులో రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన ఒకరు మృతి చెందినట్లుు ప్రకటించారు. ఆరోగ్యశాఖ వెంటనే అప్రమత్తమైందని, గ్రామాల్లో నిఘా పెంచిందని తెలిపారు. ఈ లక్షణాలున్న అనుమానిత కేసులకు వెంటనే చికిత్సకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని హాస్పిటల్స్ సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

    అయితే ఈ వ్యాధితో మరణాల రేటు పెరుగుతుందని, లక్షణాలు కనిపించగానే చికిత్స తీసుకుంటే మరణం నుంచి బయటపడే అవకాశం ఉందని, వేగంగా చికిత్స అందించకుంటే రోగి కోమాలోకి వెళ్లవచ్చని పిడియాట్రీషియన్ (చిన్నారుల వైద్యురాలు) మహేశ్వరి తెలిపారు. వెంటనే వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరంం ఉందని ఆమె సూచించారు. తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. లక్షణాలు తెలుసుకునే అంశాలను వివరించారు.

    ఇలా నియంత్రించాలి..
    పారిశుధ్యం లోపించకుండా చూడాలి, గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయాలి. దోమలు లేకుండా చేస్తే వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టవచ్చు. అనుమానితుల రక్తనమూనాలను ఇప్పటికే పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ‘చందీపూరా వైరస్’తో శరీర నొప్పులు, విరేచనాలు, వాంతులు, మెదడువాపు వంటి లక్షణాలతో జ్వరం వస్తుంది. ఈ వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన వైసిక్యులో వైరస్ జాతికి చెందినదిగా నిపుణులు చెప్తున్నారు.

    దోమలు, పేలు, ఇసుక ప్రాంతాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. గతంలో 2003-04 కాలంలో ఈ మెదడు వాపు లక్షణాలతో ఏపీ, గుజరాత్ లో 56 శాతం నుంచి 75 శాతం వరకు మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో గుజరాత్ లో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. చిన్నారుల మరణాలను చూసి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ వ్యాప్తికి పూర్తి చర్యలను తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భయాందోళన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే మాత్రం పిల్లలను వెంటనే దవాఖానలకు తరలించి, చికిత్స అందించాలని సూచిస్తున్నారు.

    ఇక ఉన్నతాధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరణాల రేటు తగ్గించాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులంతా గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. ముఖ్యంగా రాజ్ కోట్, సబర్ కాంత, మహిసాగర్, ఖేడా, మెహసానా, ఆరావళి, తదితర జిల్లాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వైరస్ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.