Cabinet decisions : మూడు కీలక పథకాలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. క్యాబినెట్‌ భేటీలో ఆమోదం.. త్వరలోనే అమలు..

కేంద్రం కొత్తగా మూడు పథకాలు తీసుకురాబోతోంది. ఈమేరకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం లభించింది. త్వరలోనే కొత్త పథకాలను ప్రారంభించేందుకు మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ చర్యలు చేపట్టనుంది.

Written By: Raj Shekar, Updated On : August 25, 2024 9:24 am

Cabinet decisions

Follow us on

Cabinet decisions : ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని శనివారం(ఆగస్టు 24న) భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ నెల 21న ఆయన విదేశీ పర్యటనకు బయల్దేరారు. పోలాండ్, ఉక్రెయిన్‌లలో పర్యటించారు. పోలాండ్‌త్‌ వాణిజ్య ఒప్పందం జరిగి 70 ఏళ్తు పూర్తయిన సందర్భంగా మోదీ ఆ దేశంలో పర్యటించారు. అధ్యక్షుడితో సమావేశమై కొత్త వాణిజ్య ఒప్పందాలపై చర్చించారు. గురువారం పోలండ్ పర్యటన ముగించుకుని రైలులో ఉక్రెయిన్‌ బయల్దేరారు. సుమారు 10 గంటలు రైలులో ప్రయాణించిన మోదీ.. శుక్రవారం ఉదయం ఉక్రెయిన్‌ చేరుకున్నారు. అక్కడ కూడా మోదీ ఘన స్వాగతం లభించింది. సుమారు 7 గంటలపాటు మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఇక జెలెన్‌స్కీ మోదీకి రష్యా అకృత్యాలను వీడియో రూపంలో కళ్లకు కట్టారు. అనంతరం తిరిగి రైలులో పోలాండ్‌ చేరుకుని అక్కడి నుంచి విమానంలో శనివారం భారత్‌కు చేరుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌ తిరిగొచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారు. కీలక పథకాలపై చర్చించిన కేబినెట్‌ కొత్తగా ప్రారంభించే మూడు పథకాలకు ఆమోదం తెలిపింది.

మూడు పథకాలు ఇవే…
బయో ఈ–3 (బయోటెక్నాలజీ ఫర్‌ ఎకానమీ, ఎన్విరాన్‌ మెంట్, ఎంప్లాయిమెంట్‌), విజ్ఞాన్‌ ధార పథకం… 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌ షిప్‌ పథకానికి కేంద్ర మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. క్యాబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. బయో మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం నూతనంగా బయో ఈ–3 కార్యాచరణను తీసుకువస్తోందని తెలిపారు. త్వరలో బయో విప్లవం రానుందని, బయో సైన్స్‌ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు.

– ఇక… సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్, ఆవిష్కరణలు, టెక్నాలజీ వృద్ధి వంటి విభాగాలను ’విజ్ఞాన్‌ ధార’ పథకంలో సమ్మిళితం చేశారని అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. తద్వారా నిధుల వినియోగం, అనుబంధ పథకాలు, కార్యక్రమాల మధ్య సమన్వయం సులభతరమవుతుందని పేర్కొన్నారు.

– మూడో పథకం 11, 12వ తరగతి చదివే విద్యార్థులకు కొత్తగా ఇంటర్న్‌ షిప్‌. దీనికి కేంద్రం ఆమోదం లభించిందని తెలిపారు. ఈ మూడు పథకాలతో పాటు ఏకీకృత పింఛను విధానానికి కూడా కేంద్ర క్యాబినెట్‌ సమ్మతి లభించిందని వెల్లడించారు. సర్వీస్‌లో 25 ఏళ్లు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్‌ ఇవ్వనుంది. ఈ పథకం కింద 15వ ఆర్థిక సంఘంలో 10,579 కోట్ల రూపాయల ఖర్చు చేయనుంది. సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు కానుంది. ఉద్యోగులకు సామాజిక భద్రతను అందించే ఈ యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

పెన్షన్‌గా సగం వేతనం..

రిటైర్మెంట్‌కు ఏడాది ముందు ఉన్న సగటు జీతంలో సగం మొత్తం పెన్షన్గా అందజేసేలా కొత్త విధానం తీసుకువచ్చింది. పెన్షనర్‌ మరణిస్తే 60 శాతం కుటుంబానికి వచ్చేలా అమలు చేయనున్నారు. బయో ఈ–3 విధానం ద్వారా త్వరలో బయో విప్లవం రాబోతోందని.. బయో టెక్నాలజీ, బయో సైన్స్‌ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయిమెంట్‌ ఆధారంగా బయో మానుఫ్యాక్చరింగ్‌ విధానం ఉంటుందన్నారు.