కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చి ప్రస్తుతం కొంత మేర తగ్గింది. దీంతో ప్రజలు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. అయినా ప్రభుత్వాల్లో చలనం లేకుండా పోతోంది. ఇప్పటికి కరోనా వ్యాక్సిన్ అందక ప్రాణాలు పోతుంటే ప్రభుత్వాలు అర్హులకు ఇవ్వకుండా డబ్బున్న వారికే ఇచ్చే కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో సామాన్య ప్రజలు సమిధలవుతున్నారు. తమ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ ప్రారంభమైందని నివేదికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా కోలుకోవాలి. తమ ప్రాణాలు ఏ విధంగా రక్షించుకోవాలి. దేశంలోని ప్రైవేటు ఆస్పత్రులు, హోటళ్లతో కలిసి వ్యాక్సిన్ల దందా కొనసాగిస్తున్నారు. దీంతో దీన్ని సహించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది చట్ట విరుద్ధమని, చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్, వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్ లేఖల్ని పంపించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్యాకేజీల పేరుతో ఈ మధ్య లగ్జరీ హోటళ్లు యాడ్స్ ఇచ్చుకుంటున్నాయి. ఫలానా రోజుకు ఫలానా ధర అంటూ ప్రకటిస్తున్నాయి. ఫుడ్, బెడ్, వైఫైలతో పాటు పేరుమోసిన పెద్ద ఆస్పత్రుల నుంచి సిబ్బందిని తెప్పించుకుని వినియోగదారులకు డోసులు అందిస్తున్నాయి. వ్యాక్సిన్ ను వ్యాపారం చేస్తున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని తమ పబ్బం గడుపుకుంటున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. స్టార్ హోటళ్లలో టీకాలు వేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. తక్షణం ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని, లేకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆరోగ్య శాఖ కార్యదర్శి సూచంచారు. వ్యాక్సిన్ కొనసాగుతున్న వేళ ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ డోసలు అందించడంపై కొన్ని రాష్ర్టాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మన దేశంలో 21 కోట్ల వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.