ఏపీకి కేంద్రం షాక్‌.. అప్పుల్లో భారీ కోత‌లు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఖ‌జానా ప‌రిస్థితి ఏంటనేది అంద‌రికీ తెలిసిందే. లోటు బడ్జెట్ తో ఏర్ప‌డిన రాష్ట్రం.. ఇప్ప‌టికీ క‌ష్టాల్లోనే కొన‌సాగుతోంది. నెల గ‌డిస్తే.. ఉద్యోగుల జీతాలు మొద‌లు.. ప్ర‌తీ విష‌యానికీ క‌ట‌క‌టే ఎదుర‌వుతోంది. దీంతో.. అప్పుల‌తోనే బండి నెట్టుకు రావాల్సిన ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. రుణ ప‌రిమితిలో కోత విధిస్తూ ఉత్త‌ర్వులు జారీచేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్ప‌త్తి మేర‌కు 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ మొత్తం రూ.42,472 కోట్ల బ‌హిరంగ మార్కెట్ […]

Written By: Bhaskar, Updated On : July 2, 2021 12:49 pm
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఖ‌జానా ప‌రిస్థితి ఏంటనేది అంద‌రికీ తెలిసిందే. లోటు బడ్జెట్ తో ఏర్ప‌డిన రాష్ట్రం.. ఇప్ప‌టికీ క‌ష్టాల్లోనే కొన‌సాగుతోంది. నెల గ‌డిస్తే.. ఉద్యోగుల జీతాలు మొద‌లు.. ప్ర‌తీ విష‌యానికీ క‌ట‌క‌టే ఎదుర‌వుతోంది. దీంతో.. అప్పుల‌తోనే బండి నెట్టుకు రావాల్సిన ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. రుణ ప‌రిమితిలో కోత విధిస్తూ ఉత్త‌ర్వులు జారీచేసింది.

రాష్ట్ర స్థూల జాతీయోత్ప‌త్తి మేర‌కు 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ మొత్తం రూ.42,472 కోట్ల బ‌హిరంగ మార్కెట్ రుణం తీసుకునేట్టుగా లెక్క తేల్చారు అధికారులు. కానీ.. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు భారీగా కోత‌లు పెట్టారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి బ‌హిరంగ మార్కెట్‌రుణ ప‌రిమితిని రూ.27,668 కోట్ల‌కు ప‌రిమితం చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ విష‌యాన్ని ఏపీ ఆర్థిక‌శాఖ‌కు తెలియ‌జేస్తూ.. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి లేఖ జారీ అయ్యింది.

ఏపీకి ఉన్న‌ రుణ ప‌రిమితి ఎంతో తేల్చేందుకు.. ఈ ఏడాది మార్చిలోనే లెక్క‌లు అడిగింది కేంద్రం. గ‌త కొన్ని సంవ‌త్స‌రాల్లో ఏపీ స‌ర్కారు తీసుకున్న రుణాల‌కు సంబంధించి వివ‌రాల‌న్నీ త‌మ‌కు పంపాల‌ని కోరింది. ఈ వివ‌రాల‌న్నీ రాష్ట్రం స‌మ‌ర్పించింది. వాటిని ప‌రిశీలించిన కేంద్రం.. రుణ ప‌రిమితిని బాగా త‌గ్గించింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏపీ స్థూల జాతీయోత్ప‌త్తి రూ.10,61,802 కోట్లుగా రాష్ట్ర ఆర్థిక సంఘం లెక్క‌లు వేసింది. దీని ప్ర‌కారం.. 4 శాతం అప్పులు తీసుకోవ‌చ్చ‌ని, ఆ మేర‌కు రూ.42,472 కోట్ల అప్పు తెచ్చుకోవ‌చ్చ‌ని భావించింది. కానీ.. కేంద్రం నిర్ణ‌యంతో కోత ప‌డింది.

రాష్ట్రానికి ఉన్న రుణ ప‌రిమితి క‌న్నా అద‌నంగా గ‌త సంవ‌త్స‌రాల్లోనే అప్పులు తీసుకున్న‌ట్టు కేంద్రం గుర్తించింది. ఈ మొత్తం 17,923 కోట్లుగా నిర్ధారించింది. ఇదేకాకుండా.. ఇత‌ర‌త్రా అప్పులు మ‌రో 6 వేల కోట్లు ఉన్న‌ట్టు తేల్చింది. ఇవ‌న్నీ క‌లిపి ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో 23,924 కోట్లు కోత పెట్టింది కేంద్రం. దీంతో.. ఇప్పుడు రాష్ట్రం తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న అప్పు కేవ‌లం 27,668 కోట్లు మాత్ర‌మే.

కేంద్రం ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డంతో.. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. మొత్తం 42,472 కోట్లు వ‌స్తాయ‌నుకుంటే.. అందులో భారీగా కోత‌లు ప‌డ‌డంతో ఏం చేయాలో అర్థంకాని ప‌రిస్థితి. వ‌చ్చే అప్పుల‌ను ఎలా స‌ర్దుబాటులో చేయాలా? అనే విష‌య‌మై అధికారులు స‌మావేశ‌మై చ‌ర్చించిన‌ట్టుగా తెలుస్తోంది. కేంద్రానికి మ‌రికొన్ని వివ‌ర‌ణ‌లు పంపి, మ‌రికొంత అద‌న‌పు రుణాల‌ను పొందే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి, కేంద్రం నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూడాలి.