పోలవరం సాగు నీటి ప్రాజెక్టు వ్యయాన్ని తామే పూర్తిగా భరిస్తామని చెబుతూనే కేంద్రం తరచూ మెలికలు పెడుతున్నది. భూసేకరణ వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని ఈ మధ్య చెప్పగా, తాజాగా రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తనకూ వాటా ఇవ్వాలని కేంద్రం మెలిక వేసింది. అంచనా వ్యయంలో భారీగా కొత్త విధించింది. అయినా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నోరు విప్పలేక పోతున్నది.
మరోవంక, 2017-18 ధరల ప్రకారం రాష్ట్రం ప్రతిపాదించిన తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లలోనూ భారీగా కోత విధించింది. అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లేనని పేర్కొంటూ కేంద్ర ఆర్థికశాఖ నియమించిన కమిటీ ఆ మొత్తానికి ఆమోదముద్ర వేసింది. దానితో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం సమస్యగా మారింది.
ఈ విధంగా ప్రాజెక్ట్ అంచనా వ్యయంలో కోత పడడానికి జగన్మోహన్‌రెడ్డి స్వయంకృపరాధమే అనే విమర్శలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లుగా పేర్కొంటూ కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. దీనిని కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) పరిశీలించి ఆమోదించింది.
అయితే కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రభుత్వం తుది అంచనా వ్యయాన్ని భారీగా పెంచిందని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేశారు. కానీ తాను అధికారంలోకి వచ్చాక.. ఇదే మొత్తాన్ని తుది అంచనా వ్యయంగా ఆమోదించాలని కేంద్రాన్ని కోరడం గమనార్హం. అయితే కేంద్ర ఆర్థికశాఖ దీనిపై కమిటీని నియమించింది. ఏకంగా రూ.7931.13 కోట్లకు కోతపెట్టింది.
ఇంత భారీగా కత్తెరవేసినా జగన్ అభ్యంతరం వ్యక్తం చేయక పోవడం విస్మయం కలిగిస్తుంది. విపక్షంలో ఉన్నప్పుడు లేనిపోని ఆరోపణలు చేయడం, ఇంత భారీగా అంచనాలు ఎలా పెంచుతారని కేంద్రానికి పదే పదే ఫిర్యాదులు చేయడంతో ఇప్పుడు అదే కేంద్ర కమిటీ అంచనా వ్యయాన్ని తగ్గించగా మారు మాట్లాడకుండా ఈ నిధులతోనే సరిపుచ్చుకోవలసిన దుస్థితి నెలకొందని ప్రభుత్వ వర్గాలు చేబుతున్నాయి.
సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగానే పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు భవన నిర్మాణం (టర్బయిన్లు మినహా) పనులు ఉన్నాయి. వీటి ఖర్చును కూడా హెడ్‌వర్క్స్‌లో భాగంగానే కేంద్రం భరిస్తోంది. ఆ సాకుతో ఇప్పుడు వాటా అడుగుతున్నది.
రాష్ట్ర విభజన సమయంలో ఒకసారి కేంద్రం జల విద్యుత్‌లో వాటా కావాలని డిమాండ్ చేసింది. నాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అంగీకరించలేదు. మళ్లీ ఇప్పుడు జలవిద్యుత్కేంద్రంలో ఉత్పత్తి అయ్యే 960 మెగావాట్లలో తనకూ వాటా ఉంటుందని ఇటీవల సూత్రప్రాయంగా రాష్ట్రం వద్ద ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రప్రభుత్వం ఇరకాటంలో పడింది.
జగన్ సర్కారు స్వయంకృతమే!