ఏపీ కాకుండా మరో 3 రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారల పాటు వాయిదా వేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ లో సవాల్ చేయగా, మరో మూడు రాష్ట్ర ప్రభుత్వాలు సహితం తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసాయి. రాజస్థాన్ ప్రభుత్వం కూడా వాయిదా కోరినా కోర్ట్ ఆదేశంతో ఎన్నికలు జరుపుతున్నందును […]

Written By: Neelambaram, Updated On : March 17, 2020 12:20 pm
Follow us on

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారల పాటు వాయిదా వేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ లో సవాల్ చేయగా, మరో మూడు రాష్ట్ర ప్రభుత్వాలు సహితం తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసాయి.

రాజస్థాన్ ప్రభుత్వం కూడా వాయిదా కోరినా కోర్ట్ ఆదేశంతో ఎన్నికలు జరుపుతున్నందును హైకోర్ట్ ను సంప్రదించామని ఎన్నికల కమీషన్ సూచించింది. పశ్చిమబెంగాల్‌, ఒడిషా, మహారాష్ట్రల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాజస్థాన్‌లో ఆరు మున్సిపాలిటీలకు నిర్వహించతలపెట్టిన ఎన్నికలను కూడా వాయిదా వేయాలని ప్రభుత్వం కోరగా, హైకోర్టుకు వెళ్లాలని ఈసి సూచించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో నిర్వహించతలపెట్టిన మున్సిపల్‌ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎన్నికల వాయిదాకు సంబంధించి ఈసి సోమవారం రాష్ట్రంలోని అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించింది. పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్న ఈసి ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకుంది.

15 రోజుల తర్వాత రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై చర్చిస్తామని, ఆ తరువాత ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్‌ సౌరవ్‌ దాస్‌ మీడియాకు చెప్పారు. కరోనా వల్ల ఎన్నికలు కొంత ఆలస్యమైనా, ఏ సమయంలోనైనా నిర్వహించేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 107 మున్సిపాలిటీలకు జరగాల్సిన ఈ ఎన్నికలను 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నారు.

అంతకుముందు కరోనా నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేయాలని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఎన్నికలు వాయిదా వేస్తే తమకేమీ అభ్యంతరం లేదని ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా ప్రకటించాయి.

ఒడిషాలో ఈనెల 24న పలు స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఈసి ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు జిల్లా పరిషత్‌లు, ఆరు పంచాయతీలు, ఎనిమిది పంచాయతీ సమితులు, 84 వార్డులకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఈసి తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో తాజాగా తొలికరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో నిర్వహించాల్సిన అన్ని స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఉద్దవ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పాటైన ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని జైపూర్‌, కోట జిల్లాలకు చెందిన కలెక్టర్లు స్థానిక స్వపరిపాలన మంత్రిత్వ శాఖను కోరిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

దీనిపై ఈసి నిర్ణయం తీసుకోకుండా హైకోర్టుకు వెళ్లి ఎన్నికలను వాయిదా వేయించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అంతకుముందు ఏప్రిల్‌ 18లోగా ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.