https://oktelugu.com/

Farmers Protest: మొత్తానికి రైతులతో రాజీకి కేంద్రం కీలక అడుగులు

రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఐదు సంవత్సరాల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని ప్రభుత్వం తరఫున మేము చెప్పాం.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 19, 2024 / 03:18 PM IST
    Follow us on

    Farmers Protest: పంటలకు కనీసం మద్దతు ధర, ఇతర సమస్యల పరిష్కారానికి రైతు సంఘాలు కొద్ది రోజులుగా హర్యానా రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నాయి. కేంద్రంతో నిర్వహించిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో అవి చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. త్వరలో పార్లమెంటు ఎన్నికలున్న నేపథ్యంలో కేంద్రం రైతు సంఘాలతో మరోసారి చర్చలు మొదలు పెట్టింది. ఇదివరకు మూడుసార్లు జరిగిన చర్చలు విజయవంతం కాకపోవడంతో.. ఈ వారం సాయంత్రం 8 గంటల 15 నిమిషాలకు నాలుగో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట వరకు ఈ చర్చలు జరిగాయి. కేంద్రం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా , వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వంటి వారు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రైతు సంఘాల నాయకులు కూడా చర్చలలో కూర్చున్నారు. సుదీర్ఘంగా చర్చలు సాగిన అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ వివరాలను వెల్లడించారు.

    ” రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఐదు సంవత్సరాల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని ప్రభుత్వం తరఫున మేము చెప్పాం. కందులు, మినుములు, మొక్కజొన్న, మైసూర్ పప్పు పండించే రైతులతో సహకార సంఘాలు ఒప్పందం కుదురుచుకుంటాయి. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే పంటలకు సంబంధించి ఎటువంటి పరిమితి ఉండదు. దీనికోసం ప్రభుత్వం నుంచి ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం సూచించిన ఈ ప్రతిపాదనల వల్ల పంజాబ్ రాష్ట్రంలో వ్యవసాయం బాగుపడుతుంది. భూగర్భ జలాల మీద ఒత్తిడి ఉండదు. సాగు భూములు సారం కోల్పోకుండా ఉంటాయి” అని పీయూష్ గోయల్ వెల్లడించారు.

    మరోవైపు ప్రభుత్వ ప్రతిపాదనపై రైతు సంఘం నేతలు స్పందించారు. సోమ, మంగళవారాల్లో రైతు సంఘాల నేతలతో చర్చిస్తామని ప్రకటించారు. దీనిపై నిపుణుల అభిప్రాయం కూడా తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన డిమాండ్లను ఇంకా నెరవేర్చలేదని వారు అన్నారు. అయితే దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వం ఒక స్పష్టతనిస్తుందనే భావిస్తున్నామని ఆయన అన్నారు. కాదు ప్రస్తుతానికి అయితే చలో ఢిల్లీ కార్యక్రమం నిలిపివేశామని.. ఒకవేళ డిమాండ్ల సాధన జరగకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. కాగా, ఫిబ్రవరి 8,12, 15 తేదీల్లో ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రైతు సంఘాల నేతలు దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే ఆ రైతు సంఘాల నేతలను ఫిబ్రవరి 13న ఢిల్లీ శివారులోని శంభు, ఖనౌరీ ప్రాంతంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతు సంఘాల నాయకులు అప్పటినుంచి అక్కడే ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతుల ఆందోళనకు పాల సంఘాలు మద్దతు ప్రకటించాయి. మద్దతు ధర పై చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, రైతులు, వ్యవసాయ కూలీలకు పింఛన్లు, పంట రుణాల మాఫీ, విద్యుత్ చార్జీలపై టారిఫ్ ఎత్తివేత, 2021 నాటి నిరసనల్లో రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, అప్పటి ఆందోళనల్లో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు, 2013 నాటి భూసేకరణ చట్టం పునరుద్ధరణ వంటి వాటిని అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ డిమాండ్లపై కేంద్రం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.