ఏపీ సీఎం జగన్ సాగునీటి ప్రాజెక్టులను తన హయాంలోనే పూర్తి చేయాలని భావిస్తున్నాడు. దీంతోనే పోలవరం పనులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు. వీటితోపాటు ఏపీలోని పలు సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేశాడు. అదేవిధంగా సీఎం జగన్ తొలి నుంచి రాయలసీమకు సాగు, తాగునీటిని అందించేందుకు పొతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం(రాయలసీమ లిఫ్ట్)కు శ్రీకారం చుట్టాడు.
Also Read: బీజేపీ అందుకే పోలవరాన్ని పక్కనపెట్టిందా..!
ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటి నుంచి బాలరిష్టాలు వీడడంలేదు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్.. కృష్ణా బోర్డు మెలికలు పెడుతుండగా తాజాగా కేంద్రం కూడా జగన్ సర్కారుకు షాకిచ్చింది. తాజాగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కు వ్యతిరేకంగా దాఖలైన ఓ కేసును విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ తన ఉత్తర్వుల్లో మరో బ్రేక్ వేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగానే ట్రైబ్యునల్ ఈ తీర్పు ఇవ్వడంతో కేంద్రం తీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి.
రాయలసీమలోని పొతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో అభ్యంతరాలను తెలుపుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీ తన వాటాకు మించి నీటిని తోడుకునేందుకు ఈ ప్రాజెక్టు వీలు కల్పిస్తుందని తెలంగాణ వాదిస్తోంది. ఇవే అభ్యంతరాలతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు దాఖలైంది. దీనిని విచారించిన ఎన్టీటీ చెన్నై ధర్మాసనం కేంద్రం అభిప్రాయాన్ని కోరింది.
జల్‌శక్తి మంత్రిత్వశాఖ దీనిపై అఫిడవిట్ దాఖలు చేయగా ఎన్జీటీ వీటి ఆధారంగా నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి చెబుతున్నట్లుగా రాయలసీమ లిఫ్ట్‌కు పర్యావరణ అనుమతులు తప్పనిసరని.. కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఎన్జీటీ కూడా ఏకాభిప్రాయానికి వచ్చింది. దీంతో పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్‌పై ముందుకెళ్లొద్దని ఏపీ సర్కారుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ తాజా తీర్పులో ఆదేశించింది.
Also Read: బీజేపీ అందుకే పోలవరాన్ని పక్కనపెట్టిందా..!
రాయలసీమ లిఫ్ట్ కింద తాగు, సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉన్నందున పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టు నిర్మించడం సరికాదని ఎన్జీటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించి అనుమతులు తీసుకోవాల్సిందేనని జగన్ సర్కారుకు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పర్యావరణ అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. దీంతో జగన్ కేంద్రం వద్ద లాయిబీంగ్ చేసి అనుమతులు సాధిస్తుందా? లేక ఇది గతంలో ఉన్న పోతిరెడ్డిపాడుకు అనుబంధమే కాబట్టి అనుమతులు అవసరం లేదని వాదిస్తుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!