ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిసారించారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో విభజన హామీలో భాగంగా కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకురుస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పించి పనులను వేగవంతం చేసింది.
Also Read: అమరావతి భూకుంభకోణం కేసులో ఏసీబీ దూకుడు… ఆ ఎమ్మెల్యేలకు షాక్….?
కరోనా ఎఫెక్ట్ తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొంత ఆలస్యం అవుతోంది. ఏపీలో కరోనా కారణంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వీలైనంత త్వరగా వస్తే పనులు మరింత వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. నేడు రాజ్యసభలో జీరో అవర్లో ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్రం త్వరలోనే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రూ.3,805 కోట్ల రూపాయల బకాయిల విడుదల కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు. త్వరలోనే మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. కరోనాతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుందని కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు త్వరగా చెల్లించాలని సీఎం జగన్మోహన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,805కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు.
Also Read: మరణించినా ‘కోడెల’ను వదలవా జగన్?
కేంద్రం నుంచి పోలవరానికి రావాల్సిన నిధుల్లో జాప్యం జరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్లో నిధులు కేటాయిస్తోంది. పోలవరాన్ని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించి ముందుకెళుతున్నారు.. ఇక త్వరలోనే కేంద్రం పోలవరం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఏపీకి కేంద్రం నుంచి నిధులు వస్తే పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగం పుంజుకునేలా కన్పిస్తున్నాయి.