Center Govt- Agneepath Scheme: అగ్నిపథ్ విధానంపై కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనల నేపథ్యంలో కేంద్రం దిగొచ్చింది. నిరుద్యోగుల నుంచి వస్తున్న నిరసనల సందర్భంలో కేంద్రం సత్వరమే ఈ చర్యలు తీసుకోవడంతో వారిలో హర్షం వ్యక్తం అవుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో యువత కేంద్రం తీరుపై విరుచుకుపడింది. పలు రైళ్లకు నిప్పుపెట్టింది. పలు రైల్వే ఆస్తులను ధ్వంసం చేసింది. దీంతో కేంద్రం హుటాహుటిన అందులో కొన్ని మార్పులు తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది.
అగ్నిపథ్ ద్వారా యువతను సైన్యంలో చేర్చుకునేందుకు ఉద్దేశించిన పథకాన్ని రూపకల్పన చేసింది. ఇందులో చేరిన వారికి నాలుగేళ్లు సేవలందించిన తరువాత 25 శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన సైన్యంలోకి తీసుకుని మిగతా వారిని పలు సంస్థల్లో రిజర్వేషన్ పద్ధతిలో వివిధ ఉద్యోగాల్లో పంపేందుకు ఉద్దేశించింది. దీంతో ఈ పథకంపై నిరుద్యోగులకు ఆందోళన మొదలైంది. మరోవైపు వయోభారం కావడంతో ఉద్యోగాలు పొందలేమనే ఉద్దేశంతో వారు గొడవకు దిగి ఆందోళన చేశారు. దీంతో నగరం మొత్తం అట్టుడుకింది. పోలీసులు సైతం ఏం చేయలేకపోయారు.
Also Read: China Military: చైనా ప్రమాదకర ఎత్తు.. భారత్‌సహా పొరుగు దేశాలకు ముప్పు!
అగ్నివీరులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారికి కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో పది శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు వయోపరిమిలో కూడా సడలింపు ఇచ్చేందుకు అంగీకరించింది. అగ్నిపథ్ లో మొదట దరఖాస్తు చేసుకున్న వారికి ఐదేళ్లు సడలింపు ఇవ్వనుంది. ఇప్పటికే అగ్నిపథ్ లో దరఖాస్తు చేసుకునే వారికి రెండేళ్లు సడలింపు ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు నిరాశ చెందాల్సిన పనిలేదని సూచించింది.
కేంద్ర సాయుధ బలగాల ఉద్యోగాల్లో భారీగా ఖాళీలున్న నేపథ్యంలో అగ్నివీరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. సైన్యంలో పనిచేసేందుకు యువత ముందుకు రావాలని ఆకాంక్షిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వివాదాలు సద్దుమణిగి రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శుక్రవారం నాటి ఆందోళనల కారణంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుని అగ్నిపథ్ నియామక ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోనుందని సమాచారం.