AP Telangana:తెలంగాణ, ఏపీ విడిపోయి ఏడేళ్లు అవుతుంది. విడిపోయిన రాష్ట్రాలు ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు.. ఇతర సమస్యలు పరిష్కరించండి మొర్రో అని గొంతు చించుకున్నా కేంద్రం నుంచి అసలు పట్టింపే లేకుండేది.కానీ ఏమైందో ఏమీ కానీ సడెన్ గా పిలిచింది. కేంద్రం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎస్ లకు పిలుపు వచ్చింది.

విభజన హామీల పరిష్కారానికి తేల్చుకుందాం రండి అంటూ కేంద్రం ఏపీ, తెలంగాణ సీఎస్ లకు కబురు పంపింది. సంక్రాంతి పండుగ ముందర జనవరి 12న ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై కీలక సమావేశం నిర్వహిస్తోంది. దీనికి రెండు రాష్ట్రాల అధికారులను ఆహ్వానించింది.
2014లో విడిపోయిన తెలుగు రాష్ట్రాల మధ్య చాలా పంచాయితీ ఉండేది. నాడు చంద్రబాబు, ఇక్కడ కేసీఆర్ తగ్గేదేలే అని ఉద్యోగుల పంపిణీ, ఆస్తుల విభజన, ఆదాయం విషయంలో మొండిగా వ్యవహరించారు. కానీ జగన్ ఏపీకి సీఎంగా వచ్చాక తెలంగాణ సీఎం కేసీఆర్ కోరిక ఏపీ సెక్రటేరియట్ ను కూడా తెలంగాణకు ఇచ్చేశాడు. ఇప్పుడంతా సామరస్యంగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకొని పరిష్కరించుకుంటున్నారు. ఉద్యోగుల విషయంలోనే కాస్త తెగని పీటముడి ఉంది.
ఇప్పుడు అన్ని మిగిలిపోయిన సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంది. విడిపోయిన ఏడేళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల అధికారులను ఆహ్వానించి పంచాయితీ పెడుతోంది. మరి ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న అపరిష్కృత సమస్యలను కేంద్రం పరిష్కరిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.