YS Viveka Case : వివేక హత్య సమయంలో ఉదయ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నాడు

వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైల్లో ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డిని ఇప్పటికీ సిబిఐ అధికారులు ఆరు రోజులపాటు కష్టపడికి తీసుకొని ప్రశ్నించారు.

Written By: NARESH, Updated On : April 25, 2023 10:07 pm
Follow us on

YS Viveka Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారుల విచారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న నిందితుడు గద్దల ఉదయ్ కుమార్ రెడ్డి గురించి పులివెందులలో సిబిఐ అధికారులు తాజాగా ఆరా తీశారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైల్లో ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డిని ఇప్పటికీ సిబిఐ అధికారులు ఆరు రోజులపాటు కష్టపడికి తీసుకొని ప్రశ్నించారు. నిందితుడు చెప్పిన వివరాలు ఆధారంగా పులివెందులలో సిబిఐ అధికారులు మంగళవారం ఆరా తీశారు. సుధాకర్ రెడ్డి చెప్పిన అంశాల్లో ఉన్న వాస్తవాలను అధికారులు క్రాస్ చెక్ చేసుకునే పనిని చేపట్టారు. కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లిలోని యురేనియం ప్రాజెక్టులో గత కొన్నేళ్లుగా ఉదయ్ కుమార్ రెడ్డి ఉద్యోగం చేస్తున్నాడు. యుసిఐఎల్ జనరల్ మేనేజర్ ఎమ్మెస్ రావును పలు కీలక అంశాలను అడిగి అధికారులు తెలుసుకున్నారు. సోమవారం, మంగళవారాల్లో ప్రాజెక్టు అధికారులను కలిసి ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధించిన అనేక వివరాలను సిబిఐ అధికారులు సేకరించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డి యురేనియం కర్మాగారంలో డ్యూటీలో ఉన్నాడా..? లేడా..? అనే దానిపై సిబిఐ అధికారుల ప్రధానంగా ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధించిన రికార్డులను సిబిఐ అధికారులు ఈ సందర్భంగా పరిశీలించారు. దీనికి సంబంధించిన పలు కీలక అంశాలను అధికారులు సేకరించారు.

వివేకా కుమార్తె.. అల్లుడిని విచారించిన అధికారులు..

వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ అధికారులు తాజాగా మరి కొంత మందిని విచారించారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలను సిబిఐ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. వివేక హత్య, తదనంతర పరిణామాలపై ఇద్దరిని పలు కీలక అంశాలు అడిగి సిబిఐ అధికారుల సమాచారం సేకరించినట్టు తెలిసింది. రాజశేఖర్ రెడ్డిని శనివారం సాయంత్రం సిబిఐ అధికారులు పిలిచి దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని సిబిఐ అధికారులు రాజశేఖర్ రెడ్డి కి సూచించినట్లు చెబుతున్నారు.

మూడు గంటలపాటు భార్యాభర్తలను ప్రశ్నించిన అధికారులు..

రెండు రోజుల కిందట సిబిఐ అధికారులను కలిసిన రాజశేఖర్ రెడ్డిని.. మంగళవారం సునీతతో కలిసి రావాలని సిబిఐ అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఆ మేరకు రాజశేఖర్ రెడ్డి భార్యతో కలిసి సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిబిఐ కార్యాలయానికి వచ్చారు. దాదాపు మూడు గంటల పాటు సిబిఐ అధికారులు ఇద్దరిని ప్రశ్నించారు. పలు కీలక అంశాల్లో వీరిద్దరి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం సిబిఐ అధికారులు చేశారు. హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి.. సునీత, రాజశేఖర్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో సిబిఐ అధికారులు ఇద్దరిని పిలిచి పలు విషయాలు అడిగి సమాధానాలు రాబట్టారు. కుటుంబ వివరాలు, వివేక రెండో వివాహం, హత్య జరిగిన విషయం ఎలా తెలిసిందని వివరాలను సునీత, రాజశేఖర్ రెడ్డి ల నుంచి సిబిఐ అధికారులు అడిగి తెలుసుకున్నారు. వాళ్లు చెప్పిన విషయాలను సిబిఐ అధికారులు నమోదు చేసుకున్నారు. వీళ్ళిద్దరూ చెప్పిన వివరాలు ఆధారంగా సిబిఐ అధికారులు మరికొంతమందికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి విచారణ గడువును సుప్రీంకోర్టు మరి కొంతకాలం పెంచిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ అధికారులకు ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు అవకాశం దొరికినట్లు అయింది.