పోలీసు వ్యవస్థ మెజారిటీగా భ్రష్టుపట్టిపోయిందనే ఒకస్థాయి నమ్మకం జనాల్లో వచ్చేసింది. ఏసీబీ, సీఐడీ వంటివి కూడా ప్రభుత్వాల కోసమే పనిచేస్తున్నాయనే విమర్శలు తరచూ వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు పూర్తిస్థాయి నమ్మకం ఉన్న వ్యవస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ). అందుకే.. అన్యాయం తీవ్రమైందని భావించినప్పుడల్లా.. ఖచ్చితంగా నిజం నిగ్గుతేలాలని భావించినప్పుడల్లా.. సీబీఐని రంగంలోకి దించాలనే డిమాండ్లు వస్తుంటాయి.
అయితే.. అంతటి ప్రజావిశ్వాసం చూరగొన్న సీబీఐని కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు తమ అవసరాలకు వాడుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తమ మాట వినని వారిని దారిలోకి తెచ్చుకునేందుకు.. విపక్షాలపై దాడులు చేయడానికి ఈ అత్యున్నత సంస్థను ఉపయోగించుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. సీబీఐ చీఫ్ సింహాసనంపై నీతిమంతులు కూర్చోవాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. తాజాగా.. కొత్త సీబీఐ చీఫ్ నియామకం జరిగింది. ఈ సెలక్షన్ లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వ్యవహరించిన తీరుపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
సీబీఐ చీఫ్ ఎంపికలో ముగ్గురి పాత్ర ఉంటుంది. ప్రధానితోపాటు ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సభ్యులుగా ఉన్న కమిటీ ఎంపిక చేస్తుంది. సీబీఐ కొత్త బాస్ ఎంపికకోసం రెండు రోజుల క్రితం ఈ కమిటీ సమావేశమైంది. కొత్త బాస్ గా రాకేష్ ఆస్తానా నియమితులు కాబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన కాకపోతే మరో ఇద్దరిలో ఒకరు అవుతాయరంటూ ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరు కేంద్రానికి సన్నిహితులు అనే చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎంపిక ఆసక్తిని రేకెత్తించింది.
అయితే.. ఈ ముగ్గురు కాకుండా మరో పేరు తెరపైకి వచ్చేలా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వ్యవహరించారని అంటున్నారు. అదికూడా నిబంధనల ద్వారానే చేశారు. సీబీఐ చీఫ్ పదవిలో కూర్చోవాలంటే కనీసం ఆరు నెలల పదవీ కాలం ఉండాలని సుప్రీం గతంలో ఆదేశాలు జారీచేసింది. పై వారికి అంత వ్యవధి లేకపోవడంతో కొత్త షార్ట్ లిస్ట్ సిద్ధమైందట. అందులోంచి సుభోద్ కుమార్ జైస్వాల్ పేరును ఖరారు చేశారు.
ఆ విధంగా.. కేంద్రం అభీష్టానికి భిన్నంగా కొత్త సారధి సీబీఐ చీఫ్ పదవిలో కూర్చోబోతున్నారని అంటున్నారు. ఈ విషయంలో సీజేఐ నిబంధనల ప్రకారం నడుచుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరి, సీబీఐ కొత్త బాస్ సుబోధ్ కుమార్ జైస్వాల్.. సంస్థ ప్రతిష్టపై పేరుకుపోతున్న దుమ్మును చెరిపేస్తారా? లేదా? అన్నది చూడాలని అంటున్నారు.