
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లే లక్ష్యంగా విమర్శలు ప్రారంభించారు. తండ్రికొడుకులపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని అధోగతి పాలు చేశారని ఎద్దేవా చేశారు. మెట్రో నగరంలో సమస్యలు ఎక్కడికక్కడే మిగిలిపోయాయని దుయ్యబట్టారు. సిటీలో చెత్త పేరుకుపోయిందని స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ ను పిలిచి ఆయనపై చెత్త వేశారని గుర్తు చేశారు.అదే విధంగా మంత్రి కేటీఆర్ కు సన్మానం చేయాలని సూచించారు.
మంత్రి కేటీఆర్ కు ప్రజా సమస్యలు పట్టడం లేదని పేర్కొన్నారు. మూసీలో నడుములోతు నీళ్లలో నాలుగు గంటలు నిలబెడితే పేదల సమస్యలు తెలుస్తాయని చెప్పారు. మురుగు, వాసనతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుంటారని అన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉత్తిత్తి మాటలు చెప్పి కాలం వెళ్లదీసే నాయకులు వీరని విమర్శించారు. ఏడేళ్లలో చేసింది ఏమీ లేదని గుర్తు చేశారు.
కేటీఆర్ నడకను క్యాట్ వాక్ గా అభివర్ణించారు. ఆయన నగరమంతా అర గంటలో తన బలగంతో చుట్టేసి వస్తారని పేర్కొన్నారు. టీవీలలో క్యాట్ వాక్ మాదిరి కేటీఆర్ నడక ఉంటుందని చెప్పారు. నగరం మొత్తం చెత్తతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. ఇందుకు బాధ్యులు తండ్రి కొడుకులేనని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాక కూడా రూ.10 వేలు ఇస్తామని చెప్పినా తరువాత ఎవరికి కూడా ఇచ్చిన సందర్బాలు లేవని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్ దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీక అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణకు పట్టిన శనీశ్వరులని అన్నారు. రాష్ర్టాన్ని అధోగతి పాలు చేసేందుకు కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీల అమలులో తాత్సారం వహిస్తున్నారన్నారు. పేదల కోసమే పని చేస్తున్నామని చెబుతూనే వారిని మరింత కిందికి దిగజార్చుతున్నారని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ప్రజలే వారిని రాష్ర్టం నుంచి పంపుతారని చెప్పారు.