Caste Politics In Telangana: ” ఇప్పటికి గూడ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలోపల పందిరి కుప్పంలు, వేం పెంటలు, కారంచేడులు జరుగుతున్నయి. తెలంగాణలో గావు. ఎందుకు జెప్తున్న అంటె ఇక్కడ బలహీన వర్గాలలో చైతన్య స్థాయి పెరిగింది. పెరగడం ఒకరోజులో గాదు. ఈ 50, 60 ఏండ్ల ఉద్యమాలు, రేపు రాష్ట్రం వచ్చి నంక కూడా రాష్ట్రాన్ని కాపాడేది ఈ చైతన్యమే. వ్యక్తులు గాదు.. సామాజిక న్యాయం అన్నప్పుడు నేను అంత న్యారోగ(సంకుచితంగా) జూడను. ఇప్పుడు తెలంగాణ లో ఎందుకు సాధ్యమైతది అంటె, ఈ నేపథ్యం జరిగినప్పుడె, స్టేట్ యొక్క ధ్యేయమది అయినప్పుడె అవన్నీ అయితయ్. ఆ ఎకనామిక్ డెవలప్మెంట్ పాలసీస్ ఎట్ల వస్తయయ్య? జనానికి ఇపుడు జయశంకర్ జెప్తెనో, నువ్వు జెప్తెనో రాదు గద. జనంలో చైతన్యం రావాలె గద. ఆ చైతన్యం వచ్చింది” ఈ ఈ మాటలు అన్నది ఎవరో కాదు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్.. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి రాసిన “ఒడువని ముచ్చట” అనే పుస్తకంలో పొందు పరిచిన మాటలు ఇవి. ఆ మాటల ప్రకారం నేడు తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా అంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
స్పష్టమైన విభజన రేఖ
ఒకప్పుడు కలిసి ఉన్నప్పటికీ ఆంధ్రకు తెలంగాణకు స్పష్టమైన విభజన రేఖ ఉండేది. మొదటి నుంచి తెలంగాణ ప్రాంతంలో మనుషుల మధ్య ఐక్యత ఎక్కువ. సామాజిక ఉద్యమాలు, ఇతర సాంస్కృతికపరమైన అంశాలు ఇక్కడి మనుషుల జీవితాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపించాయి. నిజాం, దొరల ఏలుబడిలో ప్రజలు సామాజిక వివక్షకు గురయ్యారు. స్వీయ స్వాతంత్రం పొందిన తర్వాత ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వారు ఎదుర్కొన్న వివక్ష.. వారిని సంఘటితం చేసే విధంగా అడుగులు వేయించింది. ఇలాంటి అడుగులే గొప్ప గొప్ప ఉద్యమాలకు కారణమయ్యాయి. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కాలోజీ నారాయణరావు.. వంటి వారు ఉద్యమాలలో క్రియాశీలక శక్తులుగా వెలుగొందారంటే దానికి కారణం సమాజ ఐక్యతే. అక్కడిదాకా ఎందుకు అంతటి ప్రబలంగా సాగిన తెలంగాణ ఉద్యమంలోనూ అన్ని శక్తులు ఒకటయ్యాయి. తెలంగాణను సాధించుకున్నాయి. దీనికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సమాజం విడిపోయిందా?
తెలంగాణ ఏర్పడిన తర్వాత కొద్ది రోజుల వరకు పరిస్థితి బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల నాయకులను భారత రాష్ట్ర సమితిలోకి కేసిఆర్ ఆహ్వానించారో అప్పుడే పరిస్థితి మారిపోయింది. తన క్యాబినెట్లో కేవలం తన సామాజిక వర్గానికి పెద్దపీటవేయడం, తన సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇవ్వడంతో తెలంగాణ లోనూ కులం అనే జాడ్యం మొదలయింది. ఇది వర్గాల మధ్య విభజన రేఖకు కారణమైంది. ఇదే సమయంలో ప్రభుత్వం ఒకింత అ నియంతృత్వ ధోరణితో పరిపాలించడంతో మిగతా సామాజిక వర్గాలు ఏకమయ్యాయి. వాటి హక్కుల కోసం నినందించడం మొదలుపెట్టాయి. ఫలితంగా సమాజం అనేది వర్టికల్ గా డివైడ్ అయింది. మొన్నటికీ మొన్న బండి సంజయ్ ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తొలగించింది. సాధారణగానే బండి సంజయ్ అంటే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపించింది.. కానీ యాదృచ్ఛికంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా బండి సంజయ్ తొలగింపును తప్పు పట్టారు. కెసిఆర్ తో మడమతిప్పకుండా యుద్ధం చేస్తున్నందునే బీజేపీ నాయకులు ఇలాంటి చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు.. ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏంటని ప్రశ్నించారు.. సాధారణంగా రాజకీయ కోణంలో చూస్తే ఇది పెద్ద తప్పుగా అనిపించకపోవచ్చు..కానీ ఇక్కడ నాయకులు బీసీ అనే కోణంలో మాట్లాడుతుండటం విశేషం. నాడు బండి సంజయ్ నియామకం రోజున కూడా బీసీ సంఘాలు హర్షం ప్రకటించాయి. సంబరాలు చేసుకున్నాయి. ప్రస్తుతం తొలగించినప్పుడు మాత్రం బీజేపీ అధిష్టానం మీద గరం గరం అవుతున్నాయి. బండి సంజయ్ సొంత సామాజిక వర్గం అగ్గి మీద గుగ్గిలం అవుతుండటం ఇక్కడ విశేషం. అయితే బండి సంజయ్ కి బీజేపీ అన్యాయం చేసిందని ఆ సామాజిక వర్గం నాయకులు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతుండడం గమనించదగ్గ విషయం. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు కులాలు అంటేనే అసహ్యించుకున్న తెలంగాణలో.. ఇప్పుడు అదే కులాల కోసం కొట్లాడుతుండడం మారిన పరిస్థితులకు నిదర్శనం.