హుజూరాబాద్ లో కుల రాజ‌కీయం?

కుల ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాలు చేయ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పోలిస్తే.. తెలంగాణ‌లో కాస్త త‌క్కువే అంటారు విశ్లేష‌కులు. కేసీఆర్ కూడా ఈ మాట‌ను చాలా సార్లే వ‌ల్లెవేశారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితిలో మార్పు వ‌స్తోందా? కులాల వారీగా ఓట్లు దండుకునే కార్యక్రమం మొదలు పెట్టారా? అంటే.. అవును అనే అభిప్రాయమే వ్య‌క్త‌మ‌వుతోంది. కేసీఆర్ ఈ విధ‌మైన ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌ని అంటున్నారు. హైద‌రాబాద్ లో ఎంఐఎంతో స‌న్నిహితంగా ఉండ‌డానికి కార‌ణం.. ముస్లింల ఓట్లేన‌ని అంటారు. అదే స‌మ‌యంలో హిందువుల […]

Written By: Bhaskar, Updated On : July 26, 2021 1:44 pm
Follow us on

కుల ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాలు చేయ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పోలిస్తే.. తెలంగాణ‌లో కాస్త త‌క్కువే అంటారు విశ్లేష‌కులు. కేసీఆర్ కూడా ఈ మాట‌ను చాలా సార్లే వ‌ల్లెవేశారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితిలో మార్పు వ‌స్తోందా? కులాల వారీగా ఓట్లు దండుకునే కార్యక్రమం మొదలు పెట్టారా? అంటే.. అవును అనే అభిప్రాయమే వ్య‌క్త‌మ‌వుతోంది. కేసీఆర్ ఈ విధ‌మైన ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌ని అంటున్నారు.

హైద‌రాబాద్ లో ఎంఐఎంతో స‌న్నిహితంగా ఉండ‌డానికి కార‌ణం.. ముస్లింల ఓట్లేన‌ని అంటారు. అదే స‌మ‌యంలో హిందువుల ఓట్లు కూడా చేజార‌కుండా ఉండేందుకే.. యాగాలు, య‌జ్ఞాలు జ‌రిపిస్తుంటార‌ని, త‌ద్వారా తాను అస‌లైన హిందుత్వ వాదినే అని చాటుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటార‌ని చెబుతుంటారు విశ్లేష‌కులు. అయితే.. ఇది ఓవ‌రాల్ రాజ‌కీయంగా చెప్పుకోవ‌చ్చు. కానీ.. ఇప్పుడు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక కోసం మాత్ర‌మే తీసుకుంటున్న నిర్ణ‌యాలు కేసీఆర్ రాజ‌కీయానికి అద్దం ప‌డుతున్నాయ‌ని అంటున్నారు.

మొన్న‌టికి మొన్న తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌కు గులాబీ తీర్థం పోశారు. ఆయ‌న తెలంగాణలో మాస్ లీడర్ ఏమీ కాదు. మరి, ఏ కోణంలో తీసుకున్నారు? అన్నప్పుడు.. హుజూరాబాద్ ఎన్నికల కోసం కారెక్కించుకున్నారని చెబుతారు. చాలా మంది నేతల్లాగే ఆయ‌న కూడా అలా ఉంటారు.. వ‌చ్చిన న‌ష్టం ఏముందిలే అనే కోణంలో కేసీఆర్ ఆలోచించి ఉంటార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. మ‌రి, హుజూరాబాద్ లో ర‌మ‌ణ వ‌ల్ల జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటి అన్న‌ప్పుడు.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనూ నేత సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు చాలా మందే ఉన్నారు. వారిని కారువైపు తిప్పేందుకే.. ర‌మ‌ణ‌ను సైకిల్ దించార‌ని చెబుతారు. ఈ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ ఓడిపోతే.. ఆ ప్ర‌భావం ఏ స్థాయిలో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అందుకే.. ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోవ‌ద్ద‌ని గులాబీ బాస్ భావిస్తున్నారు.

ఇక‌, దీంతోపాటు మ‌రో కుల ఈక్వేష‌న్ కూడా తెర‌పైకి తెచ్చారు. ‘ద‌ళిత బంధు’ పేరుతో పథకం పెట్టి.. దాని గురించి చేస్తున్న ప్రచారం అంతా ఇంతకాదు. ఇవాళ దీనిపై ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో భారీస్థాయిలో మీటింగ్ పెడుతున్నారు. అవ‌స‌ర‌మైతే ఈ ప‌థ‌కానికి ల‌క్ష కోట్లు ఇస్తాన‌ని చెబుతున్నారు కేసీఆర్‌. ద‌ళితు జనోద్ధ‌ర‌ణ‌కు ప్రాణాలైనా ఇస్తాన‌ని చెప్పుకొస్తున్నారు. దీనికి కార‌ణం.. హుజూరాబాద్ లో ద‌ళితుల ఓట్లు గ‌ణ‌నీయంగా ఉన్నాయి. దాదాపు 40 శాతం మేర ఉన్నాయి. ఇవ‌న్నీ రాబ‌ట్టేందుకే ఈ ప‌థ‌కం పెట్టార‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. కేసీఆర్ కూడా.. ‘‘అవును.. ఈ ఎన్నిక కోస‌మే పెట్టాం.. అయితే ఏంటీ’’ అంటూ బ‌హిరంగంగా రివ‌ర్స్ లో ద‌బాయించేశారు. ఇవన్నీ చూసుకున్న‌ప్పుడు తెలంగాణ‌లో కూడా కులాల పేరిట‌ రాజ‌కీయం చేయ‌డం తార‌స్థాయికి చేరుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, ఇది ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్న‌ది చూడాలి.