
కుల రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ లో కొదవలేదన్నది జగమెరిగిన సత్యం. కులం పేరుతో ఆధిపత్యం ప్రదర్శించేందుకు సాగిస్తున్న ప్రయత్నాలకూ అంతు లేదు. అయితే.. ఇప్పుడు ఒకే కులానికి చెందిన వారు రచ్చకెక్కి రాజకీయం చేస్తుండడం నెవ్వర్ బిఫోర్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. క్షత్రియ కులానికి చెందిన అధికార, విపక్ష పార్టీలకు చెందిన వారు ప్రకటనల రూపంలో చేసిన పంచాయితీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నిన్న ఏకంగా పత్రికల్లో ఒక యాడ్ (ప్రకటన) వచ్చింది. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్షత్రియ సమాజం’’ పేరుతో ఈ అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చారు. విజయనగర రాజవంశీయుడు అశోక్ గజపతి రాజును ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు దూషిస్తున్నారని, దీనివల్ల క్షత్రియుల మనోభావాలు గాయపడ్డాయని రాసుకొచ్చారు. అలాంటి వారు నోటిని అదుపులో ఉంచుకోవాలని, వీరిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కు బహిరంగ లేఖ మాదిరిగా రాశారు. దీంతో.. మర్నాడు ఈ ప్రకటనకు వెంటనే కౌంటర్ వచ్చింది.
ఈ బాధ్యతను అధికార పార్టీకి చెందిన వారు తీసుకున్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని క్షత్రియుల పేరిట కొన్ని దినపత్రికల్లో వచ్చిన ప్రకటన ఎవరు ఇచ్చారో తెలియదనీ.. కానీ, ఇది ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేదిగా ఉందని, క్షత్రియులు గమనించాలని రాసుకొచ్చారు. ‘‘అశోక గజపతి రాజు తన సొంత అన్న కూతురు అయిన సంచయితకు ఎందుకు అన్యాయం చేయాలని అనుకుంటున్నారో చెప్పాలి. మహిళలకు ఎలాంటి హక్కులూ ఉండవని అశోక గజపతి చెబుతున్నారా? ఎన్నో తప్పులు చేసిన ఆయన కులం చాటున దాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు.’’ అంటూ ఘాటు వ్యాఖ్యలతో కూడిన కౌంటర్ ఇచ్చారు.
ఈ విధంగా.. క్షత్రియ కులం పేరుతో రెండు వర్గాలకు చెందిన వారు రచ్చకెక్కి వాగ్వాదం పెట్టుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఇటు విపక్షం.. అటు అధికార పక్షం ఒకే కులానికి చెందిన రెండు గ్రూపులను రంగంలోకి దింపి కుల రాజకీయాన్ని షురూ చేశాయని అంటున్నారు జనం.