Karimnagar: కరీంనగర్ లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదం సంచలనం రేపింది. సినిమాను తలదన్నే విధంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. బతుకు దెరువు కోసం రోడ్డు పక్కన విశ్రమించడమే వారి శాపమా? ఒక బాలుడికి డ్రైవింగ్ అప్పగించడం ఎంతవరకు సమంజసం. నిద్రలోనే వారి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఏం జరిగిందో తెలియదు. ఏమవుతుందో తెలియదు. మొత్తానికి నలుగురు మహిళలు దుర్మరణం చెందడం విషాదకరం. దీనిపై పలు పార్టీలు ఆందోళన చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడంపై కన్నీటిపర్యంతమయ్యారు.

కరీంనగర్ కమాన్ ప్రాంతం సమీపంలో రోడ్డు పక్కన గుడారాలు ఏర్పాటు చేసుకుని నాలుగు కుటుంబాలు సీస కమ్మరి పని చేసుకుంటున్నాయి. పొద్దంతా పని చేసి అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నారు.ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఓ కారు మాత్రం వారిపై నుంచి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దం కావడంతో అందరు వచ్చారు. తొమ్మిది మంది పై నుంచి కారు దూసుకెళ్లగా నలుగురు చనిపోయారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు.
చనిపోయిన వారిలో సునీత(38), ఫరియాడ్ (37), లలిత (25), జ్యోతి (13)గా గుర్తించారు.రెక్కాడితే కానీ డొక్కాడని అభాగ్యుల జీవితం తెల్లారిపోయింది. తెల్లవారక ముందే వారి కళ్లు శాశ్వతంగా మూతపడ్దాయి. అత్యంత విదారకంగా వారి బతుకు నుజ్జునుజ్జయింది. అభం శుభం తెలియని వారికి ఎందుకీ శిక్ష. కారు డ్రైవింగ్ చేసే బాలుడి దురాగాతానికి అందరు బలైపోయారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ దుర్ఘటనపై అందరు శోకసంద్రంలో మునిగిపోయారు.
రోడ్డు పక్కన ఉంటూ వచ్చిన పని చేసుకుంటూ దొరికింది తింటూ కూలినాలి చేసుకునే బతుకుల్లో ఇంతటి దారుణమా? వారిలో ఏ ఆశలు లేవు. బతుకుపై లక్ష్యం లేదు. ఉన్నదల్లా పని వస్తే చేసుకుని పట్టెడన్నం తిని రాత్రయితే పడుకోవడమే వారి తెలుసు. కుట్రలు తెలియవు. కుతంత్రాలు అసలే రావు. కానీ ప్రశాంతమైన వారి జీవితంలో ఇంత దారుణమైన చావు వస్తుందని అనుకోలేదు. తెల్లారితే చాలు పనిలో మునిగే వారి పని మూగబోయింది. వారి సమ్మెట బరువెక్కింది. స్థానికులు పెడుతున్న కంటనీరు అందరు ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతమంతా విషాద చాయలు అలుముకున్నాయి.