https://oktelugu.com/

Haryana : పార్లమెంటు ఫలితాల్ని బీజేపీ ఒప్పుకున్నప్పుడు, హర్యానా ఫలితాల్ని కాంగ్రెస్ ఎందుకు ఒప్పుకోదు ?

రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. ఈ రాజకీయాలు అధికారాన్ని దక్కించినప్పుడు ఆ పార్టీల పాచికలు పారినట్టు. అదే అధికారం దక్కనప్పుడు పాచికలు విఫలమైనట్టు. అయితే ఈ విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోవు. అందులో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. ఇలా అనడానికి ఎటువంటి ఇబ్బంది అనిపించడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి కాబట్టి..

Written By:
  • Neelambaram
  • , Updated On : October 8, 2024 / 09:02 PM IST

    Haryana Election Result

    Follow us on

    Haryana : సరిగ్గా మూడు నెలల క్రితం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. సొంతంగా అధికారాన్ని దక్కించుకోలేక మిత్రపక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఇలాంటి ఫలితాలను బిజెపి ఊహించలేదు. బిజెపికి కంచు కోటలా ఉండే ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలలో వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. దీంతో బిజెపి అంతర్మథనంలో పడింది. ఇదే సమయంలో నాడు 99 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది. దేశంలో బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించింది. మిత్ర పక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నరేంద్ర మోడీ.. త్వరలో గద్దె దిగుతారని విమర్శించింది. “ఇండియా కూటమిని వెక్కిరించారు. కానీ నేడు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. దీన్ని ఎలా తీసుకుంటారనేది వారి ఇష్టం. కానీ అంతిమంగా మేము పుంజు కుంటున్నాం. ప్రజల మన్ననలు పొందుతున్నామని” కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పట్లో వ్యాఖ్యానించారు.

    స్వరం మారింది

    నాడు పార్లమెంట్ ఫలితాల సమయంలో బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు.. మంగళవారం ప్రకటించిన హర్యానా – జమ్ము కాశ్మీర్ ఫలితాల తర్వాత స్వరం మార్చడం విశేషం. ముఖ్యంగా హర్యానాలో అధికారం దక్కకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెర వెనుక ఏదో జరిగి ఉంటుందని ఆరోపిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 48 స్థానాలను బిజెపి గెలుచుకుంది. కాంగ్రెస్ 37 స్థానంలో విజయం సాధించింది. ఐ ఎన్ ఎల్ డి రెండు స్థానాల్లో విజయం సాధించింది.. ఆప్ ఖాతా తెరవలేదు.. జేజేపీ కూడా ఖాతా తెరవలేదు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మంగళవారం ప్రకటించిన తొలి రౌండు ఫలితాలలోనూ అదే ట్రెండ్ కనిపించింది. కానీ ఆ తర్వాత బిజెపి స్పీడ్ పెంచింది. ప్రతి రౌండ్ లోనూ లీడ్ కొనసాగించింది. అయితే దీనిని కాంగ్రెస్ నాయకుడు తప్పుపడుతున్నారు. హర్యానా ఎన్నికల్లో తమ పార్టీ మాత్రమే గెలిచి ఉండాల్సిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మొదటి పార్లమెంట్ ఫలితాలను ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఇప్పుడు హర్యానా ఎన్నికల ఫలితాలను మాత్రం భిన్నంగా చూడడం విశేషం. వాస్తవానికి హర్యానా ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేక పవనాలు వీసినప్పటికీ.. వాటన్నిటిని తట్టుకొని ఆ పార్టీ నిలబడగలిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ధైర్యంగా అధిగమించగలిగింది. అందువల్లే ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కానీ ఈ విషయాన్నే కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోతున్నది.