CM Jagan- AP Employees: సీపీఎస్ రద్దు విషయంలో జగన్ సర్కారు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. గత ఎన్నికలకు ముందు సీపీఎస్ రద్దు పై జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే వందల వారాలు దాటినా హామీని మాత్రం అమలుచేయలేకపోయారు. ఇప్పుడు బీజేపీయేతర ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు చేస్తుండడంపై జగన్ సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సీపీఎస్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పంజాబ్ లో కూడా రద్దు చేసి చూపించారు. గుజరాత్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు అదే హామీని ఇస్తున్నారు. ఇలా సీపీఎస్ రద్దుచేసిన రాష్ట్రాల జాబితా ఐదుకు చేరింది. దీంతో అందరి దృష్టి ఏపీపై పడింది. ఎందుకంటే సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి జగన్ రాజకీయ లబ్ధి పొందారు. ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడం ఏం నిర్ణయం తీసుకుంటారోనని దేశమంతా ఎదురుచూస్తోంది.

విపక్షంలో ఉన్నప్పుడే జగన్ సీపీఎస్ రద్దుపై గట్టిగానే డిమాండ్ చేశారు. కానీ గత మూడున్నరేళ్లుగా చేయగలిగే స్థానంలో ఉన్నా సీపీఎస్ ను రద్దుచేయలేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు జగన్ సర్కారుపై రగిలిపోతున్నారు. ఆయన చర్యలతో విసిగివేశారిపోయిన ఉపాధ్యాయులు ఆత్మహత్యలతో నిరసన బాట పడుతున్నారు. తాజాగా నంద్యాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు సీపీఎస్ రద్దులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకోనున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు చేసి మరీ నిద్రమాత్రలు మింగారు. ఇది ఉపాధ్యాయ వ్యవస్థలో సంచలనం రేపింది. అందుకే జగన్ సర్కారుతో అమితుమీకి వారు సిద్ధపడుతున్నట్టు సంకేతాలిస్తున్నారు.
Also Read: Minister Roja Dance: అందరి ముందు ఆ పనిచేసిన మంత్రి రోజా… అంతా అవాక్కు..వైరల్ వీడియో..
సీపీఎస్ రద్దు అసాధ్యమని బీజేపీయేతర ప్రభుత్వాలు నిరూపిస్తున్నాయి. ధైర్యంగా సీపీఎస్ ను రద్దుచేసి చూపిస్తున్నాయి. ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం జగన్ వెనుకడుగు వేస్తున్నారు. అప్పట్లో తెలియకుండా హామీ ఇచ్చామని.. సీపీఎస్ రద్దు అనేది ఆర్థికభారంతో కూడుకున్న పని అని దీనికి ఒక ఫుల్ స్టాప్ తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. ప్రత్యేక హోదా విషయంలో ఇదే మాదిరిగా జగన్ మడత పేచీ వేశారు. కేంద్రం ఫుల్ మెజార్టీతో ఉండడం వల్ల డిమాండ్ చేయలేమని.. కేంద్ర ప్రభుత్వ దయతోనే హోదా సాధ్యమని చెప్పుకొచ్చారు. అయితే ప్రత్యేక హోదా మాదిరిగా సీపీఎస్ రద్దును రద్దు పద్దుగా చూపించడాని జగన్ ప్రయత్నించినా కాలేదు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు రద్దు చేస్తుండడంతో ఏపీకి కూడా అనివార్యంగా మారింది. కానీ అది సాధ్యం కాదన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే సీపీఎస్ అమలుచేస్తానన్న హామీతోనే కొన్నిరకాల అప్పులు, రుణ రాయితీలు లభిస్తున్నాయి. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించిన మరుక్షణమే రుణాలు, రాయితీలకు బ్రేక్ పడే అవకాశముండడంతో జగన్ సర్కారు వెనుకడుగు వేస్తోంది.

సెప్టెంబరులో సీపీఎస్ రద్దు డిమాండ్ పై పోరాటానికి దిగిన ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వ అణచివేసింది. పెద్ద ఎత్తున కేసులు సైతం నమోదుచేసింది. అయితే కేసులకు భయపడితే సీపీఎస్ రద్దు అనేది అసాధ్యమని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. అయితే ఇది జగన్ సర్కారుకు మింగుడుపడడం లేదు. ఇప్పటికే ఆ రెండు వర్గాలను దూరం చేసుకోవడంతో వచ్చే ఎన్నికల్లో దెబ్బ తప్పదని భావిస్తున్నారు. అందుకే ఎన్నికల్లోపు ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని చూస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు రాజకీయ పక్షలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.
Also Read:Cold booming In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న చలి