
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు సిద్ధమైపోయారు షర్మిల.ఈ మేరకు క్షేత్రస్థాయిలో జిల్లాల వారీగా వైఎస్సార్ అభిమానులతో చర్చలు కొనసాగిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఓ ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. షర్మిల మీద తెలంగాణలో ఓ కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసును ఎత్తివేసేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోందట.
కానీ.. ఆ కేసు ఎత్తేస్తే అదే కేసులో ఉన్న తమ వ్యతిరేకులు కొండా మురళి, కొండా సురేఖపైనా కేసు ఎత్తేయాల్సి వస్తుంది. దీంతో షర్మిలకు రిలీఫ్ ఇవ్వడానికి తెలంగాణ సర్కార్.. వేరే మార్గాలు అన్వేషిస్తోంది. అయితే కోర్టు మాత్రం అలా ఓ కేసులో ఉన్న కొంత మందిపై కేసు ఎత్తివేయడం.. కొంత మందిపై కొనసాగించడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న వినిపిస్తోంది. దీంతో తెలంగాణ సర్కార్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. అసలు కేసు టీఆర్ఎస్ దృష్టిలో చిన్నది కాదు. పెద్దదే.
2012లో పరకాలలో ఉపఎన్నికలు జరిగాయి. వైసీపీ తరపున కొండా సురేఖ పోటీలో నిలబడ్డారు. టీఆర్ఎస్ తరపున భిక్షపతి పోటీ చేశారు. ఆ సందర్భంగా పోటీ తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయినట్లయితే.. ఉద్యమ హవా తగ్గిపోయేది. కానీ.. స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఆ సమయంలో పోటీ చేసిన కొండా సురేఖ తరపున ప్రచారానికి షర్మిల, విజయలక్ష్మి వెళ్లారు. అయితే.. అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని అప్పుడు కేసు నమోదైంది. ప్రజాప్రతినిధులపై కేసులను త్వరగా తేల్చే ఉద్దేశంలో ఉన్న న్యాయస్థానాలు ఇటీవల ఇలాంటికేసులన్నింటినీ త్వరత్వరగా విచారణ జరుపుతున్నారు.
ఈ క్రమంలో షర్మిల, విజయలక్ష్మిల కేసు కూడా విచారణకు వస్తోంది. ఓ సారి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ లోపు కేసును ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరిగింది. ప్రభుత్వం కూడా.. షర్మిళ, విజయలక్ష్మిలపై ఉపసంహరించుకోవాలనే అనుకుంటోంది. ఇది ఒక్క రోజులోనే పని. కానీ.. ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. విజయమ్మ, షర్మిళపై మాత్రమే కేసు ఉపసంహరించే ఉద్దేశం కనిపిస్తోందని.. హైకోర్టు ఆదేశాల మేరకు కేసును త్వరగా తేల్చాల్సి ఉందని స్పష్టం చేశారు. 31న విజయమ్మ, షర్మిళ సహా నిందితులందరూ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించినట్లుగా ఆధారాలను అధికారులు సమర్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో షర్మిల, విజయలక్ష్మిలపై కేసు ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. కానీ.. వీరికి రిలీఫ్ ఇచ్చినా.. కొండా దంపతులను వదిలిపెట్టాలని ప్రభుత్వం అనుకోవడం లేదు.