Jagan Vs Chandrababu: జగన్ ను చంద్రబాబు ఓడించగలడా?

పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబాన్ని గత నాలుగు దశాబ్దాలుగా ఆదరిస్తూ వస్తోంది. ఆ కుటుంబానికి చెందిన వారే ఎమ్మెల్యేలు అవుతూ వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్లు సీఎంలుగా బాధ్యతలు స్వీకరించారు.

Written By: Dharma, Updated On : August 3, 2023 10:12 am

Jagan Vs Chandrababu

Follow us on

Jagan Vs Chandrababu: పులివెందులలో సీన్ మారుతోందా? జనంలో తిరుగుబాటు ప్రారంభమైందా? జగన్ అడ్డాలో చంద్రబాబుకు నీరాజనం దేనికి సంకేతం? గతంలో ఎన్నడూ లేనట్టుగా భారీ స్పందన రావడానికి కారణం ఏంటి? ఇది నిజంగా జనంలో మార్పా? భయం బద్దలై అభిమానం బహిర్గతయిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. పులివెందులలో చంద్రబాబు పర్యటన సక్సెస్ అయినట్లు తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వై నాట్ పులివెందుల అన్న స్లోగాన్ ను బలంగా వినిపిస్తున్నారు.

పులివెందులలో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో కు జనం బ్రహ్మరథం పట్టారు. తొలుత పూలంగళ్ళ సర్కిల్లో బహిరంగ సభ పెట్టాలని టిడిపి నేతలు నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పాత బస్టాండ్ వద్ద సభ ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే భారీగా జనాలు తరలివచ్చారు. యువత, మహిళలు మిద్దెలు ఎక్కి చంద్రబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా ఉన్నారు. టిడిపి శ్రేణులు జన సమీకరణ చేశాయి. కానీ పులివెందుల లాంటి చోట్ల టిడిపి నాయకులు పిలిచినా గతంలో ప్రజలు కదలలేని పరిస్థితి. అయితే ఇప్పుడు సగం మందిని జన సమీకరణ చేస్తే…మిగతా సగం మంది మాత్రం స్వచ్ఛందంగా తరలివచ్చినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. దీంతో వైసిపి వర్గాల్లో ఆందోళన ప్రారంభమైంది.

పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబాన్ని గత నాలుగు దశాబ్దాలుగా ఆదరిస్తూ వస్తోంది. ఆ కుటుంబానికి చెందిన వారే ఎమ్మెల్యేలు అవుతూ వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్లు సీఎంలుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యర్ధులు అడుగుపెట్టడానికి కూడా వీలులేని స్థితిలో పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబం పట్టు సాధించింది. అయితే ఇటీవల కుటుంబంలో జరిగిన పరిణామాలు మసకబార్చాయి. సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి కూడా జగన్ భయపడుతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబును పులివెందుల జనాలు నీరాజనం పలకడం కొత్త సంకేతాలు ఇచ్చినట్టైంది. అటు చంద్రబాబు సైతం ఎలాంటి భారీ బందోబస్తు లేకుండానే రోడ్ షో నిర్వహించడం విశేషం.