Gujarat Assembly Elections 2022: ఇప్పుడు మనం ఉన్నది స్మార్ట్ యుగంలో. అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ మనం ఏం చేయాలో నిర్దేశిస్తున్నది.. ఉదయం లేచి చేసే వ్యాయామం దగ్గర నుంచి.. రాత్రి పడుకునే ముందు చెక్ చేసుకునే బీపి వరకు.. అన్ని ఫోన్ లోనే జరిగిపోతున్నాయి.. అలాంటి ఫోన్ ఇప్పుడు గుజరాత్ ఎన్నికలను నిర్దేశిస్తున్నది. స్థూలంగా చెప్పాలంటే ఫోన్లో ఇమిడి ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాల ఆధారంగా ప్రచార హోరు సాగుతోంది.. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు రకరకాల సోషల్ విన్యాసాలు చేస్తున్నాయి. ఈ ప్రచార యజ్ఞంలో వేల మంది పాల్గొంటున్నారు.. ఇక ఉచితాల చుట్టూ ఆమ్ ఆద్మీ పార్టీ పరిభ్రమిస్తోంది. గత చరిత్రను కాంగ్రెస్ మళ్లీ ఓటర్లకు గుర్తు చేస్తోంది.. మోడీ సాధించిన విజయాలను బిజెపి తన ఆస్త్రాలుగా సంధిస్తోంది. మొత్తానికి గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న డిజిటల్ వార్ న భూతో.. న భవిష్యత్. 2024 ఎన్నికలకు క్లియర్ పిక్చర్.

ప్రచారం కొత్త పుంతలు
గుజరాత్ ఎన్నికల ప్రచారం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది.. గుజరాత్ బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా ప్రచారం చేస్తున్నాయి.. వాట్సాప్ ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్రమైన నినాదాలు చేస్తున్నాయి.. వేలాదిమంది ఈ క్రతువులో పాల్గొంటున్నారు. నిజానికి బిజెపి ఆరు నెలల ముందే డిజిటల్ ప్రచారాన్ని మొదలుపెట్టింది..ఆ పార్టీకి ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లలో పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు ఉన్నారు. వీటి ద్వారానే ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వాట్సాప్ ని ఎక్కువగా నమ్ముకున్నాయి. దీని ద్వారా క్షేత్రస్థాయిలో ఓటర్లకు చేరవయ్యేందుకు కృషి చేస్తున్నాయి.. 182 స్థానాలు ఉన్న గుజరాత్ రాష్ట్రంలో డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది.
నినాదాలే ఊపిరిగా..
27 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బిజెపి 2001 నుంచి 2014 వరకు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రాజెక్టులు, వాటి ద్వారా పెరిగిన లబ్ధి, ప్రధానిగా రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రాజెక్టులు, వాటి ద్వారా గుజరాత్ పై పడిన ప్రభావాన్ని అస్త్రాలుగా ప్రచారం చేస్తుంది.. ముఖ్యంగా గుజరాత్ రూపకర్తను నేనే అని ప్రతి గుజరాతి అనుకునేలా సరికొత్త ప్రచారాన్ని మోడీనే ప్రారంభించారు. ఇప్పుడు అది రాష్ట్రంలో ప్రధాన నినాదంగా మారింది. 20 ఏళ్ల విశ్వాసం, 20 ఏళ్ల అభివృద్ధి, 20 ఏళ్ల మోడీ స్వర్ణ యుగం, వందే భారత్… బిజెపి అంటేనే నమ్మకం అనే నినాదాలతో బిజెపి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.. ఓటర్లకు దగ్గరయ్యేందుకు బిజెపి 15 కు పైగా యాప్ లను ఉపయోగిస్తున్నది. బిజెపి గుజరాత్ రాష్ట్ర శాఖకు ఫేస్బుక్లో 35 లక్షల మంది, ఇంస్టాగ్రామ్ లో 57.8 లక్షల మంది, ట్విట్టర్లో 15 లక్షల మంది, యూట్యూబ్లో 45, 600 మంది ఫాలోయర్లు ఉన్నారు. 20,000 మంది కార్యకర్తలు, 60 వేల మందికి పైగా వాలంటీర్లు డిజిటల్ ప్రచారాన్ని నడుపుతున్నారు.
కాంగ్రెస్ ఇక మారదు
మూడు దశాబ్దాల క్రితం తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేశానో వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. భారతీయ జనతా పార్టీ గుజరాత్ రాష్ట్రానికి ఏమీ చేయలేదని ప్రచారం చేస్తోంది. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ ను 7 లక్షలు, ఇంస్టాగ్రామ్ ను 64.3 లక్షల మంది, ట్విట్టర్ ను 1.64 లక్షల మంది యూ ట్యూబ్ ను 8.91 లక్షల మంది అనుసరిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలు, వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ వాట్సప్ ద్వారా ప్రచారం సాగిస్తుంది. బూత్ స్థాయిలో 50వేల గ్రూపులను ఏర్పాటు చేసింది. ఠాకూర్, పాటీదార్, ఆదివాసుల కోసం గ్రూపులను నడుపుతోంది.. కథనాలు రాసేందుకు ఏజెన్సీలను పెట్టుకుంది. 12,000 మంది వాలంటీర్లు 24 గంటల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు.

ఆప్ ఉచితాల బాటలో..
ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ఎన్నికల్లో ఉచిత పథకాలను నమ్ముకుంది. వీటిని విస్తృతంగా ప్రచారం చేస్తోంది.. వాట్సప్ సందేశాలతో ముంచెత్తుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయస్థాయిలో ఫేస్బుక్లో 5.67 లక్షల మంది, ఇంస్టాగ్రామ్ లో 1.17 లక్షల మంది, యూట్యూబ్లో 42.3 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.. కాలేజీ విద్యార్థులు, ప్రొఫెషనల్స్ పై ఆమ్ ఆద్మీ పార్టీ అధికంగా ఆధారపడుతోంది. వాట్సాప్ ను తన ప్రచార ఆయుధంగా వాడుకుంటుంది. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ఫేస్బుక్ పేజీ ఇతర పార్టీల అభ్యర్థుల కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది. ముఖ్యంగా చదువుకున్న యువత ఈయన పేజీని ఎక్కువగా అనుసరిస్తున్నారు.